
లక్నో: యంగ్ ఓపెనర్ సామ్ కాన్‌స్టస్ (144 బాల్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో109) మెరుపు సెంచరీతో ఆకట్టుకోవడంతో ఇండియా–ఎతో తొలి అనధికారిక టెస్టును ఆస్ట్రేలియా–ఎ మెరుగ్గా ఆరంభించింది. మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసేసరికి 337/5తో భారీ స్కోరుకు బాటలు వేసుకుంది.
ఇండియా బౌలర్లలో హర్ష్‌దూబే (3/88) ఆకట్టుకున్నాడు. వర్షం కారణంగా తొలి సెషన్ ఆట సాధ్యం కాలేదు. లంచ్ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు 19 ఏండ్ల కాన్‌స్టస్, మరో ఓపెనర్ క్యాంప్‌బెల్ కెలావే (88)తో అద్భుత ఆరంభం ఇచ్చాడు. ఇండియా బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్న ఓపెనర్లు తొలి వికెట్‌కు 198 రన్స్ భారీ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పారు. వీళ్ల జోరుకు ఆసీస్ 37.1 ఓవర్లనే 200 మార్కు దాటింది.
గుర్నూర్ బ్రార్ (1/47) బౌలింగ్‌లో తనుష్ కొటియన్‌కు క్యాచ్ ఇచ్చి కెలావె ఔటవడంతో ఈ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. ఆ వెంటనే నేథన్ మెక్‌స్విని (1)ని ఎల్బీ చేసిన హర్ష్ దూబే... సెంచరీ పూర్తి చేసుకున్న కాన్‌స్టస్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే ఖలీల్ అహ్మద్ (1/46).. ఓలివర్ పీక్ (2)ను ఔట్ చేయడంతో ఆసీస్ 224/4తో ఆస్ట్రేలియా ఇబ్బందుల్లో పడింది.
ఈ టైమ్‌లో కూపర్ కొనోలీ (70), లియామ్ స్కాట్ (47 బ్యాటింగ్) కలిసి ఐదో వికెట్‌కు 109 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. చివర్లో కనోలిని ఔట్ చేసిన దూబే ఈ జోడీని విడదీశాడు. ప్రస్తుతం జోష్ ఫిలిప్ (3 బ్యాటింగ్)తో కలిసి స్కాట్ క్రీజులో ఉన్నాడు. టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ 11 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.