
న్యూఢిల్లీ: టీమిండియాకు కొత్త స్పాన్సర్ వచ్చింది. నేషనల్ టీమ్ స్పాన్సర్‌షిప్ హక్కులను అపోలో టైర్స్ సంస్థ కైవసం చేసుకుంది. ఈ స్పాన్సర్‌షిప్ రెండున్నర ఏండ్ల పాటు, 2028 మార్చి వరకు సాగుతుందని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ టైమ్‌లో టీమిండియాకు 121 బైలేటర్ సిరీస్ మ్యాచ్‌లు, 21 ఐసీసీ ఈవెంట్ల మ్యాచ్‌లు ఉన్నాయి.
ఒప్పందం ప్రకారం ఇండియా మెన్స్, విమెన్స్ టీమ్స్ నేషనల్ టీమ్స్ జెర్సీలపై అన్ని ఫార్మాట్లలో అపోలో టైర్స్ లోగో ముద్రిస్తారు. మూడు సంస్థల మధ్య జరిగిన పోటీలో అపోలో టైర్స్ రూ. 579 కోట్ల భారీ బిడ్‌తో హక్కులను గెలుచుకున్నట్టు తెలుస్తోంది. వందకు పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న గుర్గావ్‌కు చెందిన టైర్ల తయారీ సంస్థ అయిన అపోలో ఈ రేసులో కాన్వా, జేకే సిమెంట్స్ కంపెనీల నుంచి ఎదురైన బిడ్డింగ్ పోటీలో నెగ్గింది.
ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన బిడ్డింగ్ ప్రక్రియలో కాన్వా రూ. 544 కోట్లు, జేకే సిమెంట్స్ రూ. 477 కోట్లకు బిడ్‌లు దాఖలు చేశాయి. కాగా, రియల్ మనీ గేమింగ్ కంపెనీలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల కారణంగా డ్రీమ్ ఎలెవన్‌తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేయడంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం టెండర్లను ఆహ్వానించింది. గతంలో డ్రీమ్ ఎలెవన్‌తో రూ. 358 కోట్ల ఒప్పందం ఉండగా, దానికంటే రూ. 200 కోట్లకు పైగా ఎక్కువ మొత్తానికి అపోలో టైర్స్‌తో బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రాబోయే రెండున్నర ఏండ్లలో అపోలో టైర్స్ ఒక్కో మ్యాచ్‌కు సగటున రూ. 4.77 కోట్లు చెల్లించనుంది.
విండీస్‌తో సిరీస్ నుంచి కొత్త లోగోతో..
కొత్త స్పాన్సర్‌గా ఖరారైన అపోలో టైర్స్ లోగోతో కూడిన కొత్త జెర్సీలను ఇండియా టీమ్ అక్టోబర్ 2న వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌లో ధరించనుంది. అంతకంటే ముందుగా సెప్టెంబర్ 30 నుంచి ఆస్ట్రేలియా–ఎతో జరిగే మూడు వన్డేల ఇండియా–ఎ సిరీస్‌లో ఈ కొత్త జెర్సీలు మైదానంలో కనిపించనున్నాయి.