మధ్యప్రదేశ్ లో 3వేల మంది జూనియర్ డాక్టర్ల రాజీనామా

మధ్యప్రదేశ్ లో 3వేల మంది జూనియర్ డాక్టర్ల రాజీనామా

భోపాల్: తమ డిమాండ్ల కోసం సమ్మెబాట చేపట్టిన జూనియర్ డాక్టర్లు.. తమ సమ్మెకు వ్యతిరేకంగా  హైకోర్టు ఆదేశాలివ్వడంతో రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి మూడు వేల మంది జూనియర్ డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కరోనా వారియర్లుగా పనిచేస్తున్న తమకు స్టైఫండ్ పెంచాలని, కరోనా బారిన పడితే తమతోపాటు తమ కుటుంబాలకు కూడా ఉచితంగా చికిత్స అందించాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె చిట్ట విరుద్ధమని, వెంటనే విధుల్లో చేరాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులతో షాక్ తిన్న జూనియర్ డాక్టర్లు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోవడమే కాకుండా కోర్టు ద్వారా తమను అణచివేయాలని చూడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విధులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మందికిపైగా జూనియర్ డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. 
వాస్తవాలు తెలపకపోవడంతోనే హైకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చిందని భావిస్తున్న జూనియర్ డాక్టర్లు తీర్పుపై అప్పీలు చేయాలని నిర్ణయించారు. ఒకవైపు సమ్మె కొనసాగిస్తూనే కోర్టులో పోరాడతామని చెప్పారు. హైకోర్టు ఆదేశాలను జూనియర్ డాక్టర్లు బేఖాతరు చేసి రాజీనామా చేయడంతో సర్కార్ బలవంతపు చర్యలకు దిగుతున్నట్లు జూనియర్ వైద్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు డాక్టర్ల ఇంటికి వెళ్లి వెంటనే విధుల్లో చేరాలని, సమ్మె విరమించాలని బెదిరింపులకు దిగుతున్నారని జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తాము బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని.. నిజంగానే తాము బ్లాక్ మెయిల్ చేసి ఉంటే రాష్ట్రంలో ఇంత తక్కువ మంది రోగులు ఉండేవారా..? కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటే సరైన వేతనాలు ఇవ్వకపోగా తమపై దుష్ప్రచారం చేస్తూ దోషులుగా నిలబెట్టాలని చూడడం సరికాదంటున్నారు. వీటన్నింటినీ హైకోర్టులో నిలదీస్తామని చెబుతున్నారు.