కౌటాల కేజీబీవీ, పాలమాకుల గురుకులం​లో విద్యార్థులకు అనారోగ్యం

కౌటాల కేజీబీవీ, పాలమాకుల గురుకులం​లో విద్యార్థులకు అనారోగ్యం

కాగజ్ నగర్/శంషాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మరో రెండు విద్యా సంస్థల్లో 31 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం పాలమాకులలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల స్కూల్, కాలేజీ(ఎంజేపీటీ)లో 16 మంది విద్యార్థులు గురువారం వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. కుమ్రంభీం జిల్లా కౌటాల కేజీబీవీలో 15 మంది స్టూడెంట్లు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. పాలమాకుల స్కూల్ లో వైద్యారోగ్య శాఖ సిబ్బంది మెడికల్ క్యాంప్ పెట్టి50 మంది స్టూడెంట్లకు కరోనా, డెంగీ పరీక్షలు నిర్వహించారు.

వాతావరణంలో మార్పుల వల్లే స్టూడెంట్లు వైరల్ ఫీవర్ బారిన పడ్డారని వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభాకర్ చుక్కతెలిపారు. అయితే, స్కూల్, కాలేజీ ఆవరణ క్లీన్ గా లేకపోవడం, సరైన ఫుడ్ ఇవ్వకపోవడంతోనే స్టూడెంట్లు అనారోగ్యం బారిన పడ్డారని స్థానికులు చెప్తున్నారు. విషయం తెలియడంతో కొందరు పేరెంట్స్ వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ఇక కౌటాల కేజీబీవీలో జ్వరం, వాంతులు, తల తిరగడం, ఒళ్ళు నొప్పులతో విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో ట్రీట్‌‌మెంట్ కోసం కౌటాల పీహెచ్ సీకి తరలించారు. కొంతమందికి గురువారమే తనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు కాగా, పీహెచ్ సీ సిబ్బంది వచ్చి మందులు ఇచ్చారు. తెల్లారేసరికి పరిస్థితి మరింత సీరియస్ కావడంతో ఆస్పత్రికి తరలించారు.