టెట్ పెట్టి ఏడాది.. టీఆర్టీ ఎప్పుడు

టెట్ పెట్టి ఏడాది.. టీఆర్టీ ఎప్పుడు
  • టీచర్ ​పోస్టులకు మూడున్నర లక్షల మంది ఎదురుచూపులు
  • రాష్ట్ర వ్యాప్తంగా 33 వేలకుపైగా టీచర్​ పోస్టులు ఖాళీ
  • చాలా చోట్ల ఇన్​చార్జ్​ హెచ్​ఎంలు, ఎంఈవోలు, డీఈవోలు

మహబూబ్​నగర్, వెలుగు: ప్రభుత్వ బడుల్లో వేలాది టీచర్​ పోస్టులు ఏండ్లుగా ఖాళీగా ఉన్నా రాష్ట్ర సర్కార్ భర్తీ చేయడం లేదు. దీంతో లక్షల మంది పేదపిల్లలకు సరైన విద్య అందడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం కేవలం ఒకే ఒక్కసారి 2017లో టీఆర్టీ (టీచర్స్ రిక్రూట్​మెంట్ టెస్ట్) చేపట్టింది. ఆరేండ్లు అవుతున్నా మళ్లీ టీచర్ పోస్టుల భర్తీ మాటే ఎత్తట్లేదు. మరోవైపు లక్షలాది మంది అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. 2020 డిసెంబర్​లో టీఆర్టీ వేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి అమలు చేయలేదు. 2022, మార్చి 9న అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ త్వరలో టీచర్​ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. అదే నెల 24న టెట్(టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు నోటిఫికేషన్ జారీ చేశారు. జూన్12న పరీక్ష నిర్వహించి, జులై 1న రిజల్ట్​ ఇచ్చారు.​ టెట్ నిర్వహించి ఏడాది పూర్తవుతుండగా, ఇంతవరకు టీఆర్టీపై ఎటువంటి ప్రకటన లేకపోవడంతో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 

మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటి వరకు టీఆర్టీ నోటిఫికేషన్​జారీ కోసం ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదు. దీంతో కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన మాటను తుంగలోతొక్కారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్రాన్స్​ఫర్లు చేయట్లే.. ఖాళీల లెక్క తేల్చట్లే

విద్యాశాఖ పరిధిలో 33 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు12 వేలు, ఎస్జీటీ10 వేలు, లాంగ్వేజ్ పండిట్స్, లో ఫీమెల్ లిటరసీ (ప్రైమరీ స్కూల్స్) హెడ్ మాస్టర్ పోస్టులు 5 వేలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇవి కాకుండా పీఈటీ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. అయితే, 2021 మార్చిలో రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్​మెంట్​ఏజ్ ను 57 ఏండ్ల నుంచి 60 ఏండ్లకు పెంచింది. దీంతో సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్​లో రిటైర్ అవ్వాల్సిన 6 వేల మంది 2024 మార్చిలో రిటైర్ కానుండటంతో ఈ పోస్టులు కూడా ఖాళీ కానున్నాయి. వీటితో కలిపి దాదాపు 33 వేలకుపైనే పోస్టులు ఖాళీ కానున్నాయి. 2017లో నిర్వహించిన టీఆర్టీలో మొత్తం 8,972 టీచర్ పోస్టులు భర్తీ చేశారు.

అంతటా ఇన్ చార్జీలే  

 రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 584 మండలాలు ఉండగా, 570 మండలాల్లో ఎంఈవో పోస్టుల్లో ఇన్​చార్జీలుగా హెచ్ఎంలు కొనసాగుతున్నారు. మిగతా14 మండల్లాల్లో మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. అలాగే14 జిల్లాల్లో మాత్రమే రెగ్యులర్ డీఈవోలు ఉన్నారు. మిగతా చోట్ల ఇన్ చార్జీలు కొనసాగుతున్నారు. వీరిలో ఒక్కో డీఈవోకు రెండు జిల్లాల బాధ్యతలను అప్పగించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 850 జీహెచ్ఎంలు, 2,650 హెడ్ మాస్టర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.

తొమ్మిదేండ్లలో మూడుసార్లు టెట్

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ తొమ్మిదేండ్లలో ప్రభుత్వం టెట్ మూడు సార్లే నిర్వహించింది. మే 22, 2016లో ఒకసారి, 23 జులై 2017లో మరోసారి.. ఐదేండ్ల గ్యాప్ తర్వాత గతేడాది జూన్ 12న మూడోసారి టెట్ పెట్టింది. గతేడాది టెట్ పేపర్​-1కు 3,18,444 మంది హాజరు కాగా 1,04,078, పేపర్​-2లో 2,50,897 మందికి గాను 1,24,535 మంది క్వాలిఫై అయ్యారు. వీరు కాకుండా 2016, 2017లో పాస్ అయిన వారు మరో రెండు లక్షల మంది వరకు ఉన్నారు. టెట్ అర్హత సాధించి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మూడున్నర లక్షల మందికి పైగానే ఉంటారు.