బీసీ గురుకుల హాస్టల్ లో 34 మంది స్టూడెంట్స్​ కు అస్వస్థత

బీసీ గురుకుల హాస్టల్ లో 34 మంది స్టూడెంట్స్​ కు అస్వస్థత
  • కొందరిని పేరెంట్స్​కు అప్పగించిన నిర్వాహకులు
  • అన్నంలో లక్కపురుగులు వస్తున్నాయంటున్న స్టూడెంట్లు
  • హాస్టల్​ ఎదుట ఏబీవీపీ ధర్నా

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు ఇప్పలపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న జ్యోతిబాపూలే బీసీ గురుకుల హాస్టల్ లో 34 మంది స్టూడెంట్స్​ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కొందరిని పేరెంట్స్ కు అప్పజెప్పారు. కొన్ని రోజులుగా వరుసగా అన్నంలో లక్క పురుగులు వస్తున్నాయని స్టూడెంట్లు చెబుతున్నారు. ఆదివారం చాలామంది అస్వస్థతకు గురయ్యారని తెలిసి ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. కలెక్టర్ రావాలంటూ నినదించారు. కొందరు పేరెంట్స్​కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఏబీవీపీ నాయకుడు రంజిత్ మాట్లాడుతూ హాస్టల్ భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. బియ్యంలో పురుగులు, మెరిగెలు వస్తున్నాయని ఆరోపించారు. బీసీ గురుకుల హాస్టల్ కు పక్కా భవనం మంజూరు చేయాలన్నారు. 

సగం మంది ఇళ్లకు..

వారం క్రితం గురుకులంలో 367 మంది స్టూడెంట్స్​ఉండగా 140 మంది సికల్​లీవ్​తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. జ్వరాలు ప్రబలడంతో పేరెంట్స్ లోనూ ఆందోళన నెలకొంది. ఆదివారం మరికొందరు వచ్చి వారి పిల్లలను ఇండ్లకు తీసుకువెళ్లారు. దీంతో హాస్టల్ సగం ఖాళీ అయ్యింది. హాస్టల్ ను పాత భవనంలో నిర్వహిస్తున్నారు. చీకటి గదుల్లో క్లాస్ లు జరుగుతున్నాయి. చన్నీళ్లతోనే స్టూడెంట్లు స్నానం చేయాల్సి వస్తోంది. దోబీ కూడా లేడు. ఆదివారం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు హాస్టల్ ను సందర్శించారు. జిల్లా వైద్యాధికారి డా. సుమన్ మోహన్ రావు, జిల్లా ఎస్పీ రాహుల్​హెగ్డే, ఆర్డీవో శ్రీనివాసరావు హాస్టల్​లో పరిస్థితిని సమీక్షించారు. డా. సుమన్ మోహన్ రావు నేతృత్వంలో రాష్ట్రీయ  బాల్ స్వస్థ్య కార్యక్రమ్(ఆర్​బీఎస్కే) డాక్టర్లు వారం పాటు గురుకులంలో ఉండి వైద్య సేవలందించాలని కలెక్టర్ ఆదేశించారు. బీసీ గురుకల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరగలేదని జిల్లా వైద్యాధికారి సుమన్​ మోహన్​రావు చెప్పారు. వర్షాకాలంలో సహజంగా వచ్చే సాధారణ జ్వరం స్టూడెంట్లకు వచ్చిందన్నారు. మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు.