35 మందిని ముంచినప్రైవేట్ కన్సల్టెన్సీ! 

35 మందిని ముంచినప్రైవేట్ కన్సల్టెన్సీ! 
  • నార్వే వర్క్ వీసా ఇప్పిస్తానని చీట్​ చేశారని బాధితుల ఫిర్యాదు
  • విచారణకు ఆదేశించిన సీఎం ప్రజావాణి ఇన్​చార్జి చిన్నారెడ్డి

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: నార్వే దేశానికి వర్క్ వీసా మీద పంపి, ఉపాధి కల్పిస్తామని చెప్పిప ఐ బుక్ అనే ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థ తమను మోసం చేసిందని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 35 మంది గ్రాడ్యుయేట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం  సీఎం ప్రవాసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రవాసి ప్రజావాణి కోఆర్డినేటర్​బొజ్జా అమరేందర్ రెడ్డి ఈ విషయాన్ని సీఎం ప్రజావాణి ఇన్​చార్జి డాక్టర్ జి.చిన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఎండార్స్ చేసి, విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ఐ బుక్ కన్సల్టెంట్ సంస్థ ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల చొప్పున వసూలు చేసిందని, నకిలీ వర్క్ పర్మిట్, నకిలీ నార్వే వీసా అపాయింట్​మెంట్ లెటర్ ఇచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కేపీహెచ్​బీ పోలీసులను బాధితులు ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

సౌకర్యాలు కల్పించండి

మైనారిటీస్ గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్ కార్డుల సౌకర్యాలు కల్పించడంతోపాటు నిబంధనల ప్రకారం వేతనాలు పెంచాలని సిబ్బంది కోరారు. సీఎం ప్రజావాణికి వచ్చి ఇన్​చార్జి చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు.