బ్యాంకులకు క్యూ కట్టిన రూ. 2వేల నోట్లు..35 శాతం జమ

బ్యాంకులకు క్యూ కట్టిన రూ. 2వేల నోట్లు..35 శాతం జమ

రూ. 2 వేల నోట్లు బ్యాంకులకు క్యూ కట్టాయి. 2 వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకున్న తర్వాత దేశంలోని బ్యాంకుల్లో ప్రజలు  రూ. 2వేల నోట్లను జమ చేసేందుకు పోటెత్తారు. ఇప్పటివరకు దేశంలో సర్క్యులేషన్ లో ఉన్న రూ. 2 వేల  నోట్లలో 35 శాతం తిరిగా బ్యాంకులకు వచ్చేశాయని ఆర్బీఐ ప్రకటించింది. 

రిజర్వ్ బ్యాంకు మే 19వ తేదీన రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను  మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని తెలిపింది. దాంతో  ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయడం, మార్చుకోవడం ప్రారంభించారు. దీంతో ఇప్పటి వరకు 35శాతం రూ. 2 వేల నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని తెలుస్తోంది. 

2023 మార్చి 31 నాటికి దేశంలో 2 వేల రూపాయల నోట్లు సుమారు 181 కోట్లు ఉన్నాయి. వీటి విలువ  సుమారు 3.62 లక్షల కోట్లు. వాటిలో ఇప్పటివరకు 35 శాతం  నోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యాయి. 

2016లో ఆర్బీఐ రూ. 2000 నోటును చలామణిలోకి తీసుకువచ్చింది. 2016 నవంబర్ 8న అప్పటివరకు చెలామణిలో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసింది. నగదుకు కొరత రాకుండా ఉండేందుకు రూ. 2 వేల నోట్లను  ప్రవేశపెట్టింది.  మిగతా డినామినేషన్లలో నగదు అవసరమైనంత మేరకు వ్యవస్థలో అందుబాటులోకి వచ్చిన తరువాత క్రమంగా రూ. 2 వేల నోట్లను తగ్గించింది. ఇక 2019 నుంచి  ఆర్బీఐ రూ. 2 వేల నోట్లను ముద్రించడం కూడా ఆపేసింది.