‘జాన్ పహాడ్’కు నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు

‘జాన్ పహాడ్’కు  నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు

నేరేడుచర్ల, వెలుగు : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని జాన్ పహాడ్ మేజర్ కాల్వకు మంగళవారం 350 క్యూసెక్కుల నీటిని ఇరిగేషన్​ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఈలు ప్రసన్న, నవీన్లు మాట్లాడుతూ జాన్ పహాడ్ మేజర్ పరిధిలోని సుమారు 33 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేశామన్నారు. మరో 100 క్యూసెక్కులు కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల రైతులెవరూ అధైర్య పడొద్దని, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో వర్క్ ఇన్​స్పెక్టర్లు లక్ష్మయ్య, రాము, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

పులిచింతలకు పెరుగుతున్న వరద..

మేళ్లచెరువు, వెలుగు : చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. మంగళవారం నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో  పులిచింతల కు 1,56,964 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. మూడు గేట్లను 2 మీటర్ల మేర ఎత్తి 6,52,56 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచి పెడుతున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలకు ప్రస్తుతం 42.16 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కాగా 17,600 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుని తెలంగాణ జెన్ కో ద్వారా పవర్ జనరేషన్ పునఃప్రారంభించారు.