ఆర్టీసీలో 3,500 ఉద్యోగాలు : పొన్నం ప్రభాకర్

ఆర్టీసీలో 3,500 ఉద్యోగాలు : పొన్నం ప్రభాకర్
  •  నియామకాల ప్రక్రియ మొదలుపెట్టినం 
  • మహాలక్ష్మి స్కీంతో ఆర్టీసీ ఆదాయం పెరిగిందని వెల్లడి

హుస్నాబాద్, వెలుగు: ఆర్టీసీలో వివిధ విభాగాల్లో 3,500 ఉద్యోగాలను భర్తీ చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నియామకాల ప్రక్రియను కూడా మొదలుపెట్టినట్టు చెప్పారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో రూ.18.50 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చామన్నారు. సంస్థ మనుగడకు ఇబ్బందులు రాకుండా ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నామన్నారు. 

మరో వెయ్యి కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. మహాలక్ష్మి స్కీమ్​తో ఆర్టీసీ ఆదాయం పెరగడమే కాకుండా, దేవాదాయ ధర్మాదాయ శాఖకు కూడా ఇన్​కం వస్తోందన్నారు. ఇప్పటివరకు 25 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసినట్టు తెలిపారు. హుస్నాబాద్​ నియోజకవర్గంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి నీళ్లు ఇచ్చే బాధ్యత తనదేనని పొన్నం చెప్పారు. ఆ ప్రాజెక్టు పూర్తిచేస్తేనే తన పదవికి సార్థకత చేకూరుతుందన్నారు. సీఎం రేవంత్​రెడ్డి కూడా గౌరవెల్లి ప్రాజెక్టుకు ప్రాధాన్యాన్ని ఇస్తున్నారని, త్వరలోనే ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామన్నారు.