టీచర్ల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 3 వేల 500 మంది వరకూ ప్రమోషన్లు పొందే చాన్స్

టీచర్ల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 3 వేల 500 మంది వరకూ ప్రమోషన్లు పొందే చాన్స్
  • ఫైల్‌‌‌‌పై సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి 
  • రేపు షెడ్యూల్ రిలీజ్ చేయనున్న విద్యాశాఖ.. 3,500 మంది వరకూ ప్రమోషన్లు పొందే చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లకు మరోసారి ప్రమోషన్లు ఇచ్చేందుకు  సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సంబంధిత ఫైల్‌‌‌‌పై సీఎం రేవంత్ రెడ్డి శనివారం సంతకం చేశారు. దీంతో సుమారు 3,500 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు పదోన్నతులు రానున్నాయి. మల్టీజోన్–1, మల్టీజోన్–2 పరిధిలో సుమారు 900 గెజిటెడ్​ హెచ్ఎం, 600 పీఎస్ హెచ్ఎం పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయ నున్నారు. వీటితోపాటు మరో 2వేల వరకూ స్కూల్ అసిస్టెంట్ పోస్టులనూ పదోన్నతులతో నింపనున్నారు.

2023 సెప్టెంబర్,అక్టోబర్ నెలల్లో మల్టీజోన్ పరిధిలోని హెచ్ఎం బదిలీలు, ఆ పోస్టులకు ప్రమోషన్లు, స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు  జరిగాయి. ఆ తర్వాత కోర్టు కేసులతోఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. 2024  జూన్, జులై నెలల్లో మల్టీజోన్–2 పరిధిలోని హెచ్ఎం పోస్టులతోపాటు మిగిలిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించారు. ఈ క్రమంలోనే  ఖాళీ అయిన గెజిటెడ్​ హెచ్ఎం పోస్టుల భర్తీకి ప్రమోషన్లు ఇవ్వాలని  ఇటీవల సర్కారుకు విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించింది. దీనికి సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో సోమవారం  ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రమోషన్ల ప్రక్రియ ఇలా..
రెండ్రోజుల్లో టీచర్​ ప్రమోషన్ల షెడ్యూల్ ఇవ్వనున్నారు. ముందుగా జీహెచ్ఎం  సీనియార్టీ లిస్టులను మల్టీజోన్లవారీగా ప్రకటిస్తారు. వీటిలో ఏమైనా ఆబ్జెక్షన్స్​ ఉంటే స్వీకరించి, ఫైనల్ సీనియార్టీ లిస్టును రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత వెకెన్సీలు  చూపించి వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. అనంతరం స్కూళ్ల అలాట్‌‌‌‌మెంట్​ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్ఎం, పీడీ తదితర పోస్టులన్నింటికీ ఇదే విధానాన్ని అనుసరిస్తారు.