కశ్మీర్ ను కుదిపేస్తున్న ఆర్టికల్ 35-ఏ

కశ్మీర్ ను కుదిపేస్తున్న ఆర్టికల్ 35-ఏ

వెలుగు: జమ్మూ కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్​35-–ఏ విషయంలో జరుగుతున్న రగడతో కశ్మీరీల్లో ఆందోళన నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్టికల్​ను రద్దు చేయాలన్న ఆలోచనలో ఉందన్న వార్తలతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆర్టికల్​ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు మంగళవారం నుంచి విచారిస్తుంది. ఈ నేపథ్యంలో సుమారు 200 మందికి పైగా వేర్పాటువాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా జమాతే ఇస్లామీ సభ్యులే ఇందులో ఎక్కువగా ఉన్నారు.

ఆర్టికల్​ విషయంలో జమ్మూకశ్మీర్​కు చెందిన రాజకీయ పార్టీలు రెండుగా చీలిపోయాయి. బీజేపీ ఈ ఆర్టికల్​రద్దును సపోర్ట్​చేస్తుండగా, ఎన్​సీ, పీడీపీలు ఆర్టికల్​35-ఏ జోలికి వెళ్లకూడదని డిమాండ్ చేస్తున్నాయి. కాశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కట్టబెట్టి న ఆర్టికల్​35–ఏ కు రాజ్యాంగ హోదా లేదని పిటిషనర్లు వాదిస్తున్నారు. దీనిని రాజ్యాంగ సవరణంటూ చెప్పడంకూడా కరెక్ట్​కాదంటున్నారు. జమ్మూకశ్మీర్​విషయంలో పార్లమెంట్ హక్కులను తగ్గిస్తూ ప్రెసిడెంట్ జారీచేసిన ఉత్తర్వులను పిటిషనర్లు సవాల్​చేశారు. వీటికి రాజ్యాంగపరంగా ఉన్న హక్కులు వెల్లడించాలని కోరారు. రాజ్యాంగానికి సవరణ చేసే హక్కు ప్రెసిడెంట్ కు లేదంటున్నారు. రాజ్యాంగంలో శాశ్వత ప్రాతిపదికన కొత్త ఆర్టికల్​ను చేర్పించే అధికారం ప్రెసిడెంట్ కు లేదని వాదిస్తున్నారు. రాష్ట్రంలో పర్మినెంట్ రెసిడెన్సీపై అమలుచేస్తున్న షరతులనూ పిటిషనర్లు సవాల్​చేశారు. నిరసన ప్రదర్శనల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని చోట్ల 144 సెక్షన్​విధించింది. వేర్పాటు వాదుల బంద్​పిలుపుతో షాపులు మూతపడ్డాయి. ఇంటర్నెట్ స్పీడ్ను అధికారులు 2జీకి తగ్గించారు.