శ్రీలంకలో 36 గంటల కర్ఫ్యూ

శ్రీలంకలో 36 గంటల కర్ఫ్యూ
  • శ్రీలంకలో ఎమర్జెన్సీ
  • దేశవ్యాప్తంగా 36 గంటల కర్ఫ్యూ కూడా
  • రేపు ఉదయం దాకా అమలు
  • అల్లర్ల ముప్పు ఉందనే నిర్ణయం
  • నిషేధాజ్ఞలు జారీచేసిన ప్రెసిడెంట్ రాజపక్స

కొలంబో/న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో శ్రీలంక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రెసిడెంట్​కు వ్యతిరేకంగా జనం రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలో ఆందోళనలను అణచివేయడానికి ప్రెసిడెంట్​ గొటబయ రాజపక్స దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. శుక్రవారం రాత్రి ఈమేరకు ఆదేశాలు జారీచేశారు. ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలో అల్లర్లు జరిగే పరిస్థితి రావడంతో 36 గంటల పాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు శనివారం ప్రకటించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. అల్లర్లకు పాల్పడతారని అనుమానం వస్తే ఎవరినైనా సరే వారెంట్లు లేకుండా అరెస్ట్ చేయొచ్చని మిలిటరీకి ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతి భద్రతలను కాపాడేందుకు, నిత్యావసరాలు అందించేందుకే ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు రాజపక్స వెల్లడించారు.

ఇండియా నుంచి 40 వేల టన్నుల బియ్యం 
శ్రీలంక ప్రజలను ఆదుకునేందుకు ఇండియా 40 వేల టన్నుల బియ్యం పంపే ఏర్పాట్లు చేస్తోంది. నూరు కోట్ల డాలర్ల క్రెడిట్ లైన్ కింద ఈ సాయం చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. శ్రీలంక స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్​కు శనివారమే దక్షిణాది ప్రాంతాలలోని ట్రేడర్ల నుంచి క్రెడిట్ ఫెసిలిటీ అగ్రిమెంట్ కింద ఆహార ధాన్యాలను పంపడం మొదలుపెట్టినట్లు కేంద్రం తెలిపింది. 

ఇండియా సాయంతో కొంత ఊరట 
బియ్యంతో పాటు నిత్యావసరాలనూ ఇండియా పంపుతుండటంతో శ్రీలంకకు కొంత ఊరట లభించనుంది. ధరలు కూడా కొద్దిగా తగ్గే సూచ నలు ఉన్నాయని చెప్తున్నారు. ఇండియా నుంచి అందిన డీజిల్​లో 6 వేల మెట్రిక్ టన్నులు పవర్​ ప్లాంట్లకు  వాడతామని అధికారులు చెప్పారు. 

ఐఎంఎఫ్ సాయంపై సంప్రదింపులు 
దేశంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ రుణాలను చెల్లించలేమని శ్రీలంక సర్కారు చేతులెత్తేసింది. ఈ విషయంపై సహకారం కోసం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)తో సంప్రదింపులకు ప్రభుత్వం సిద్ధమవుతోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

సంక్షోభం.. టెర్రరిస్టుల పనే?  
శ్రీలంక ప్రెసిడెంట్ రాజపక్స ఇంటి ముందు గురువారం పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆందోళనకారులు ఓ బస్సును, పలు వాహనాలను తగులబెట్టి, భద్రత బలగాలపై దాడి చేశారు. అయితే, దేశంలో ఏర్పడిన సంక్షోభానికి రెండు ప్రతిపక్ష పార్టీలతో లింకులు ఉన్న కొన్ని టెర్రరిస్ట్ శక్తులే కారణమని పర్యాటక శాఖ మంత్రి ప్రసన్న రణతుంగ ఆరోపించారు.

శ్రీలంకకు చేరిన మన డీజిల్ 
శ్రీలంకకు క్రెడిట్ లైన్ కింద పంపిన 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ కన్ సైన్ మెంట్ శనివారం శ్రీలంకకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇంధన కొరతతో దేశంలో రోజూ 13 గంటల పాటు కరెంట్ కట్ చేస్తున్నారు. ఇటీవల విద్యుత్ కార్మికులు సమ్మె చేయడంతో ఏకంగా 72 గంటల పాటు కరెంట్ కట్ అయింది. దీంతో లంకకు సహాయం చేసేందుకు ఇండియా నుంచి పెద్ద ఎత్తున ఇంధనాన్ని కేంద్ర ప్రభుత్వం పంపుతోంది. అయితే, ఇండియా నుంచి డీజిల్ అందినందున పవర్ కట్స్ తగ్గుతాయని శ్రీలంకలోని సిలోన్ ఎక్ట్రిసిటీ బోర్డ్ అధికారి ఒకరు చెప్పారు. శనివారం దేశంలో 8.5 గంటల పాటు పవర్ కట్ చేసినట్లు తెలిపారు.

ఎమర్జెన్సీ ఎత్తేయాలె..
శ్రీలంకలో ఎమర్జెన్సీని ఎత్తేయాలని ప్రెసిడెంట్ రాజపక్సకు శ్రీలంక బార్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. దేశం లో భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజలు శాంతియుతంగా గుమిగూడటాన్ని అనుమతించాలని వందలాది మంది లాయర్లు డిమాండ్ చేశారు. మరోవైపు దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆదివారం నిరసనలు చేపట్టాలని పలు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.