
హైదరాబాద్, వెలుగు: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు శనివారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 905 పీఏసీఎస్‌ల పరిధిలోని 11,765 డైరెక్టర్ల పదవులకు మొత్తం 36,969 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరిరోజు అత్యధికంగా 22,684 నామినేషన్లు వచ్చినట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. ఈ నెల 6 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. వెయ్యికి పైగా డైరెక్టర్ పదవులకు ఒక్కటి చొప్పున నామినేషన్లు వచ్చినట్లు తెలిసింది. ఇవి ఏకగ్రీవం కానున్నాయి.
యాదాద్రి జిల్లాలోని భువనగిరి- చందుపట్ల PACSలో చివరిరోజు 48 నామినేషన్లు దాఖలైనట్లు ఎలక్షన్ ఆఫీసర్ బోడ విద్యాసాగర్ తెలిపారు. 6, 7, 8 తేదీల్లో మొత్తం 107 నామినేషన్లు రాగా..భువనగిరి PACSకు -57, చందుపట్ల PACSకు 50 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఈఓలు దంతూరి నర్సింహ గౌడ్, మొలుపోజు రామలింగాచారి, వీరవెల్లి సర్పంచ్ కల్పన శ్రీనివాసచారి, ఉప సర్పంచ్ కర్మెలమ్మ జార్జి, ఎంఎల్ ఎన్ రెడ్డి, సర్దార్ శ్రీశైలం పాల్గొన్నారు. నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు ఎన్నికల అధికారులు.
ఆదివారం నామినేషన్ల పరిశీలన, సోమవారం నామినేషన్ల విత్ డ్రా ఉంటుంది. ఆ తర్వాత ఏకగ్రీవాలపై పూర్తి స్పష్టత వస్తుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమ గెలుపు కోసం సహకరించినవారిని పీఏసీఎస్‌ల్లో పోటీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు దింపారు. పార్టీల గుర్తుతో ఎన్నికలు జరగనప్పటికీ.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువగా నామినేషన్లు వేశారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడున్న 89 పీఏసీఎస్‌లకు 2,988 మంది నామినేషన్లు వేశారు. అతితక్కువగా జోగులాంబ-గద్వాల జిల్లాలోని 11 పీఏసీఎస్‌లకు 452 నామినేషన్లు దాఖలయ్యాయి.