బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎక్కడా అభివృద్ధి జరగలే: మంత్రి వివేక్

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎక్కడా అభివృద్ధి జరగలే: మంత్రి వివేక్

మంచిర్యాల: గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో గ్రామాలు, పట్టణాలు ఎక్కడ అభివృద్ధి జరగలేదని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కేవలం కమీషన్ల కోసం ప్రాజెక్ట్‎లు, భారీ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. సోమవారం (జనవరి 19) చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటి పరిధిలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ పాల్గొని స్వయం సహాయక మహిళ సంఘాల మహిళలకు 1.71కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించేలా మహిళ స్వయం సహాయ సంఘాల మహిళల అభివృద్ధి కోసం వడ్డీ లేని రుణాలు,పెట్రోల్ బంక్‎లు ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత క్యాతనపల్లి మున్సిపల్‎లో రూ.35 కోట్లతో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. క్యాతనపల్లిలో 16 వందల కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని చెప్పారు. అర్హులైన పేదలకు 150 ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామన్నారు.