వైన్ షాపుల కోసం 67,849 దరఖాస్తులు

వైన్ షాపుల కోసం 67,849 దరఖాస్తులు
  • సర్కారుకు రూ.1,356 కోట్ల ఆదాయం
  • ఇయ్యాల జిల్లాల్లో లక్కీ డ్రా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ నుంచి 18 దాకా ఆబ్కారీ ఆఫీస్​లలో అప్లికేషన్లు తీసుకున్నారు. మొత్తంగా 67,849 అప్లికేషన్లు వచ్చాయి. గురువారం ఒక్కరోజే 37,160  దరఖాస్తులు వచ్చాయి. మొత్తం అప్లికేషన్ల ద్వారా రాష్ట్ర సర్కారుకు రూ.1,356 కోట్ల ఆదాయం సమకూరింది. పోయినసారి 48 వేల అప్లికేషన్లతో 975 కోట్ల ఇన్‌‌‌‌కం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్​ షాపులుండగా 131 ఎస్టీలకు, 262 ఎస్సీలకు, 393 గౌడ్స్‌‌‌‌కు కేటాయించారు. ఒక్కో షాపుకు సగటున 26 అప్లికేషన్లు వచ్చాయి. ఏపీ బార్డర్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌‌‌‌లో ఉంటున్న ఏపీ వ్యాపారులే భారీ సంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు. రంగారెడ్డిలో 8,224, ఖమ్మం జిల్లాలో 6,212 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ అత్యధికంగా ఒక్కో షాపుకు సగటున 61 అప్లికేషన్లు వచ్చాయి. కొత్తగూడెం 4,271, నల్గొండ లో 4,079 స్వీకరించారు. ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువగా 591 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ సగటున ఒక్కో దుకాణానికి 15 మాత్రమే వచ్చాయి.

కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా..
వైన్స్‌‌‌‌ కోసం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా లక్కీ డ్రా తీయనున్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్‌‌‌‌ ఆధ్వర్యంలో డ్రా తీస్తారు. ఇందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. డ్రా కేంద్రాలకు ఎంట్రీ పాస్‌‌‌‌ ఉన్నోళ్లను మాత్రమే అనుమతించనున్నారు. ముందుగా ఎక్కువ దరఖాస్తులు వచ్చిన ప్రాంతాల్లో ఆ తర్వాత దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉన్న చోట్లలో లక్కీ డ్రాను తీయనున్నట్లు అధికారులు తెలిపారు. డ్రాలో వైన్ షాపులు దక్కించుకున్నోళ్లు శనివారం నుంచి 22వ తేదీ వరకు లైసెన్స్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌ చెల్లించాల్సి ఉంటుంది. 29వ తేదీ నుంచి మద్యం సరఫరా చేస్తారు. ఇప్పటికే నడుస్తున్న వైన్ షాపుల లైసెన్స్ గడువు ఈ నెలలో ముగియనుంది. డ్రాలో షాపులు దక్కినవాళ్ల ద్వారా వచ్చే నెల 1 నుంచి కొత్త దుకాణాలు ఓపెన్‌‌‌‌ కానున్నాయి.