ఎమ్మెల్యే టికెట్ల కోసం.. వైఎస్సార్​టీపీకి 379 అప్లికేషన్లు

ఎమ్మెల్యే టికెట్ల కోసం.. వైఎస్సార్​టీపీకి 379 అప్లికేషన్లు
  • త్వరలోనే అభ్యర్థుల లిస్ట్, 
  • మేనిఫెస్టో ప్రకటిస్తం : పిట్టా రాంరెడ్డి

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్​టీపీ నుంచి పోటీ చేసేందుకు అన్ని నియోజకవర్గాల నుంచి 379 అప్లికేషన్లు వచ్చాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి వెల్లడించారు. త్వరలో పార్టీ చీఫ్​ షర్మిల అభ్యర్థుల లిస్ట్, మేనిఫెస్టో విడుదల చేస్తారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా మేనిఫెస్టో తయారు చేస్తున్నామన్నారు.  బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్​బీ నగర్ కు 10 అప్లికేషన్లు, జనగామకు 8 అప్లికేషన్లు వచ్చాయని, మిగతా ప్రధాన పార్టీల్లో టికెట్ ఆశించి రాని వాళ్లు కూడా సుమారు 50 మంది  దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. స్వీకరణ గడువును మరో 2 రోజులు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో షర్మిల పర్యటిస్తారని తెలిపారు. ప్రవళిక ఆత్మహత్యపై కేటీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారని, 45 రోజుల్లో ఈ సర్కారు పోతదని,  కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు. 

ఆకుల లలితతో పార్టీ నేతల భేటీ 

ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను వైఎస్సార్​టీపీ నేత నీలం రమేశ్​ హైదరాబాద్ లో కలిశారు. పార్టీలో చేరాలని ఆమెను ఆహ్వానించారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పినట్లు నీలం రమేశ్​ తెలిపారు. ఈ భేటీలో వైఎస్సార్​తో తన అనుబంధాన్ని ఆకుల లలిత గుర్తు చేసుకున్నారని ఆయన చెప్పారు.