యూపీలో పిడుగులు పడి 38 మంది మృతి

యూపీలో పిడుగులు పడి 38 మంది మృతి
  • రాష్ట్రవ్యాప్తంగా భారీ వానలు

లక్నో: ఉత్తరప్రదేశ్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే పలుచోట్ల పిడుగులు పడి 38 మంది మృతి చెందారు. ప్రతాప్‌‌గఢ్‌‌లో అత్యధికంగా 11 మంది చనిపోయారు. అలాగే, సుల్తాన్‌‌పూర్‌‌లో ఏడుగురు, చందౌలీలో ఆరుగురు, మెయిన్‌‌పురిలో ఐదుగురు, ప్రయాగ్‌‌రాజ్‌‌లో నలుగురు, ఔరయ్యా, డియోరియా, హత్రాస్, వారణాసి, సిద్ధార్థనగర్‌‌లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ప్రతాప్‌‌గఢ్ జిల్లాలో సంగ్రామ్‌‌గఢ్, జెత్వారా, అంటూ, మానిక్‌‌పూర్, కంధాయ్ పోలీసు సర్కిళ్ల పరిధిలో పదకొండు మంది చనిపోయారు. జెత్వారా, అంటూ ఏరియాల్లో పొలంలో పని చేస్తూ ఒకరు, పశువులను మేపుతుండగా మరొకరు మరణించారు.

మెయిన్‌‌పురిలోని నాగ్లా పైత్ గ్రామంలో వర్షం వస్తుండడంతో దీప్ చంద్ర (22) అనే యువతి టెంపుల్ లో​కూర్చుంది. ఆ టైంలోనే పిడుగు పడటంతో ఆమె మృతిచెందింది. మరో ఘటనలో మోను శాక్యా (22) తన తండ్రితో కలిసి టెర్రస్‌‌పై పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. చందౌలీలో 13, 15 ఏండ్ల వయసు గల ఇద్దరు యువకులు సహా చాలా మంది బాధితులు పొలంలో పనిచేస్తూ, చేపలు పడుతుండగా పిడుగుపాటుకు గురయ్యారు. సుల్తాన్‌‌పూర్‌‌లో మృతి చెందిన ఏడుగురిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వారణాసిలో ఇద్దరు సోదరులు పిడుగుపాటుకు గురయ్యారు. వారిలో ఒకరు కాలిన గాయాలతో మరణించగా.. మరొకరు చికిత్స పొందుతున్నారు. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా వరదలతో  జనజీవనం అస్తవ్యస్తమైంది.