
- పరిపాలనా అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం
- ఓఆర్ఆర్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: మూసీ నది ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఔటర్‌రింగ్ రోడ్పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కొత్తగా 39 ఎస్టీపీ(సీవేజ్ట్రీట్మెంట్ప్లాంట్)లు నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం శనివారం రూ.3,849.10 కోట్లు మంజూరు చేసింది. పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గ్రేటర్‌పరిధిలో వాటర్‌బోర్డు రూ.3,866.41కోట్లతో 39 ఎస్టీపీలను నిర్మిస్తోంది. వీటి నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. త్వరలోనే ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్చేస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కొత్తగా మరో 39 ఎస్టీపీలను నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు అమృత్ 2.0 పథకం కింద నిధులు మంజూరయ్యాయి. ఒక ఎస్టీపీని ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యం(పీపీపీ) పద్దతిలో నిర్మించనుండగా, 38 ఎస్టీపీలను హైబ్రిడ్హామిట్ మోడ్(హెచ్ఏఎం)లో నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు.
రెండు ప్యాకేజీలుగా విభజన
ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ–1లో 16, ప్యాకేజ్–2లో 22 ఎస్టీపీలను నిర్మిస్తారు. నిర్మాణం పూర్తయితే రోజుకు 972 ఎంల్‌డీల మురుగు నీటిని శుద్ధి చేసే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. స్ధానిక సంస్థల పరిధిలో ఎస్టీపీల నిర్మాణం ద్వారా మూసీ నదిలోకి వచ్చే మురుగునీటిని అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1,950 ఎంఎల్డీల మురుగు నీరు ఉత్పత్తి అవుతోంది. జీహెచ్ఎంసీ ప్రాంతంలోనే 1,650 ఎంఎల్డీలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తున్నారు.