
సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మండలం ఐనపూర్ కు చెందిన ఆర్మీ జవాన్ తోట అనిల్ (30) పంజాబ్ లో అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. విధుల్లో చేరిన మరుసటి రోజే చనిపోతున్నానంటూ ఎందుకు ఫోన్ చేశాడు. కనిపించకుండా పోవడం వెనుక కారణమేంటి.? అసలేం జరిగింది? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
తోట అనిల్ గత 11సంవత్సరాలుగా పంజాబ్ అంబాల దగ్గర ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. జూలైలో ప్రమోషన్ రావడంతో సికింద్రాబాద్ ఆర్మీ క్యాంపులో ట్రైనింగ్ తీసుకున్నాడు. అనంతరం 18రోజులు సెలవు తీసుకుని స్వగ్రామం ఐనాపూర్ కు వెళ్లాడు అనిల్. సెలవుల తర్వాత ఆగస్టు 6న పంజాబ్ వెళ్లిన అనిల్ ఆగస్టు 7న విధుల్లో చేరాడు.
ఆగస్టు 8న స్వగ్రామనికి ఫొన్ చేసి తాను చనిపోతున్నానని కుటుంబ సభ్యులకు తెలియచేసి ఫొన్ స్విచ్చాఫ్ చేశాడు. ఆగస్టు 8న అనిల్ కనబడడం లేదంటూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పంజాబ్ అంబాల ఆర్మీ కార్యాలయ అధికారులు. దీంతో అనిల్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు చొరవచూపి తమ కొడుకు ఆచూకీ తెలుసుకోవాలని కోరుతున్నారు.