మా రూ.218 కోట్లు తిరిగివ్వండి.. చిక్కుల్లో ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమా.. అసలేమైందంటే?

మా రూ.218 కోట్లు తిరిగివ్వండి.. చిక్కుల్లో ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమా.. అసలేమైందంటే?

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory).. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్లో బాగా పాపులర్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తూ టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్లో 5 సినిమాలకు పైగా నిర్మాణంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ (TheRajaSaab) ఒకటి. అయితే, లేటెస్ట్గా రాజాసాబ్ సినిమా ప్రొడక్షన్ పీపుల్ మీడియాతో భాగమైన ఫైనాన్షియల్ కంపెనీ IVYఎంటర్టైన్మెంట్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

IVYఎంటెర్టైన్మెంట్ సంస్థ ప్రకారం.. ‘రాజా సాబ్’సినిమా కోసం రూ.218 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు ఈ సంస్థ చెప్పుకొచ్చింది. అందుకు గాను ప్రపంచవ్యాప్తంగా ‘రాజా సాబ్’థియేట్రికల్ రైట్స్లో షేర్ ఇచ్చే విధంగా.. పీపుల్ మీడియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు IVYఎంటర్ టైన్ మెంట్స్ తమ పిటిషన్లో కోర్టుకు వివరించింది. అలాగే, సినిమాని ఎలాంటి పోటీ లేని సమయంలో సోలో రిలీజ్ డేట్ వచ్చేలా చూడాలని కూడా ముందే ప్లాన్ చేసుకున్నట్టు IVYసంస్థ తన పిటిషన్లో తెలిపింది. 

అయితే, ఈ క్రమంలోనే రాజాసాబ్ మూవీ అప్డేట్స్ విషయంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, షూటింగ్ కూడా చెప్పిన సమయానికి పూర్తి చేయలేదనేది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై IVYఎంటర్ టైన్ మెంట్స్ ప్రధాన ఆరోపణ.

ఇలా ముందస్తుగా కుదుర్చుకున్న కాంట్రాక్ట్ నిబంధనలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పూర్తిగా ఉల్లంఘించిందని ఐవీ సంస్థ ఆరోపించింది. ఆన్ టైంలో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయకపోవడం, రిలీజ్ డేట్ వాయిదా పడుతుందనే ప్రచారం కారణంగా తమకు ఆర్థికంగా నష్టం వాటిల్లందనేది IVYఎంటర్ టైన్ మెంట్స్ ప్రధాన వాదన. 

తమకు జరిగిన ఈ నష్టానికి ప్రతిఫలంగా.. తాము సినిమా కోసం పెట్టిన రూ.218 కోట్లు పెట్టుబడితో పాటు సంవత్సరానికి ఫైనాన్స్లో కడుతున్న 18 శాతం వడ్డీతో కలిపి మొత్తం డబ్బు.. పీపుల్ మీడియా నిర్మాణ సంస్థ తిరిగి చెల్లించాలని IVYకంపెనీ డిమాండ్ చేసింది. ఈ డబ్బు చెల్లించేంత వరకూ తమకు తెలియకుండా, తమ ఆమోదం లేకుండా ‘రాజా సాబ్’సినిమాకు సంబంధించిన బిజినెస్ జరగకుండా చూసేలా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును IVYఎంటర్ టైన్ మెంట్స్ ఆశ్రయించింది.

ఇప్పటికే, రాజాసాబ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రతి చిన్న అప్డేట్ కోసం సోషల్ మీడియాలో నిర్మాతలను, డైరెక్టర్ను తెగ కడిగేస్తున్నారు. ఒకవైపు VFX,CG వంటి విషయాలతో లేట్ చేస్తున్నారంటూ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. అలాగే, ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలతో రాజాసాబ్ షూటింగ్ కూడా వాయిదా పడిన పరిస్థితి. ఈ క్రమంలో ఏకంగా రాజాసాబ్ నిర్మాణ సంస్థపై ఢిల్లీకి చెందిన IVYఎంటెర్టైన్మెంట్ సంస్థ పిటిషన్ దాఖలు చేయడం ప్రభాస్ ఫ్యాన్స్ను షాక్కి గురిచేస్తుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా IVYఎంటర్ టైన్ మెంట్స్కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాజాసాబ్ సినిమాపై నెలకొన్న ఈ వివాదంపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అతి త్వరలో వివరణ ఇవ్వనున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది.