కోటి రూపాయల పరిహారం ఇయ్యక 385 కోట్ల ప్రాజెక్ట్​ ఆగింది

కోటి రూపాయల పరిహారం ఇయ్యక 385 కోట్ల ప్రాజెక్ట్​ ఆగింది

2016లో కాజీపేటకు పీవోహెచ్ మంజూరు చేసిన కేంద్రం

భూమి అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం
ఇప్పటికీ 11 మందికి అందని పరిహారం

వరంగల్, వెలుగు: ఉత్తర, దక్షిణ భారత దేశాలకు వారధిగా ఉన్న వరంగల్​ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్​లో రైల్వే ప్రాజెక్టుల ఏర్పాటు కలగానే మారుతోంది. సకాలంలో భూమి అప్పగించడంలో లోకల్​ లీడర్లు, ఆఫీసర్లు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రతిపాదన ఉండగా అది కాస్త రాయిబరేలీకి మళ్లించారు. ఆ తరువాత వ్యాగన్ వర్క్​షాపు ఏర్పాటుకు నిధులు మంజూరైనా చివరి క్షణంలో కర్నాటకకు తరలడంతో వరంగల్​ ప్రజలకు రైల్వే ప్రాజెక్టులు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016లో మంజూరు చేసిన పీరియాడికల్​ ఓవర్ ​హాలింగ్(పీవోహెచ్) షెడ్​కు నాలుగేళ్లు అవుతున్నా అవసరమైన భూమిని రైల్వే శాఖకు అప్పగించలేదు.  దాంతో  దాని ఏర్పాటుపైనా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. భూసేకరణకు రూ.57 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 11 మందికి రూ. కోటి పరిహారం అందించడంలో మాత్రం జాప్యం చేస్తోంది. దీంతో రూ.385 కోట్ల ప్రాజెక్టు రూ.కోటి పరిహారం కాడ ఆగినట్లయింది. అయితే కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టు పనులు మూడేళ్లలోగా ప్రారంభించకపోతే నిధులు వెనక్కి తీసుకోవడంతో పాటు ఆ ప్రాజెక్టును వేరే ప్రాంతానికి తరలించే అవకాశం ఉంది. పీవోహెచ్​ ఏర్పాటైతే ఐదారు వేల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

2016లో శాంక్షన్​

దక్షిణ మధ్య రైల్వేకు కీలకంగా ఉన్న కాజీపేట జంక్షన్​లో  కోచ్​ఫ్యాక్టరీ, వ్యాగన్​వర్క్​ షాపు లాంటివి తరలిపోయిన తరువాత ఇక్కడ ఏదైనా రైల్వే ప్రాజెక్టు చేపట్టాలని గతంలో రైల్వే ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో చాలాసార్లు ఆందోళనలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు  కేంద్రంలోని యూపీఏ సర్కారు బోగీల మరమ్మతు వర్క్​షాప్​ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేసింది. కానీ దాని ఏర్పాటుకు కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సేకరించలేకపోవడంతో అది తరలిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కాజీపేటకు పీవోహెచ్​ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు 2016–-17 బడ్జెట్లో రూ.188 కోట్లు, 2018-–19, 2019–-20 బడ్జెట్​లో రూ.10 కోట్ల చొప్పున కేటాయించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అడుగు జాగ కూడా రైల్వే శాఖకు అప్పగించలేకపోయింది.

160 ఎకరాలు అవసరం

పీవోహెచ్​ఏర్పాటుకు 160 ఎకరాల స్థలం అవసరమని ప్రతిపాదించారు. ఈ మేరకు కాజీపేట -మడికొండ సమీపంలోని అయోధ్యపురం వద్ద దేవాదాయశాఖ భూమిని పరిశీలించారు. అప్పటికే ఇందులో తాతలు, తండ్రుల కాలం నుంచి స్థానికులు సాగులో ఉన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి పరిహారం అందించి, భూమిని రైల్వే శాఖకు అందించాల్సి ఉంది. ఈ మేరకు మొత్తం రూ.57 కోట్లు పరిహారానికి కేటాయించింది. ఎండోమెంట్​ డిపార్ట్​మెంట్​కు రూ. 45 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.18కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇంకా రూ.27 కోట్లు పెండింగ్​లో ఉన్నాయి. రైతులకు మొత్తం రూ. 12 కోట్లు చెల్లించాల్సి ఉండగా గత మార్చిలో రూ.11 కోట్లు విడుదల చేశారు. ఇంకో 11 మందికి రూ.కోటి ఇవ్వడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. దీంతో రైల్వేశాఖకు సకాలంలో భూమి అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఐదారు వేల మందికి ఉపాధి

పీవోహెచ్​లో  ముఖ్యంగా రైల్వే కోచ్​లకు సంబంధించిన గ్రీసింగ్, ఆయిల్ ఛేంజింగ్, వీల్స్ టర్నవుట్ ఇలా  ప్రతి భాగాన్ని చెక్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏమైనా రిపేర్లు ఉంటే అవి కూడా పూర్తి చేయాలి. ప్రస్తుతం కాజీపేట జంక్షన్ లో ఇలాంటి ఏర్పాట్లేమీ లేకపోవడంతో ఓవర్​హాలింగ్​కు రైళ్లను ఏపీకి లేదా ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లాల్సి వస్తోందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇక్కడ పీవోహెచ్​ఏర్పాటైతే అవన్నీ చేయడానికి సుమారు వెయ్యి మంది వరకు ఇంటర్నల్​ సిబ్బంది అవసరం పడతారని అంచనా వేస్తున్నారు. వారితో పాటు  మరో నాలుగైదు వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. దీంతో పీవోహెచ్ కోసం కేటాయించిన భూమిని తొందరగా రైల్వే శాఖకు అప్పగించి, వెంటనే పనులు చేపట్టేలా చూడాలని వరంగల్ జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ఏపీలో మాత్రం స్పీడప్
కాజీపేట పీవోహెచ్ తో పాటు ఏపీలోని వడ్లపూడిలో పీవోహెచ్ ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పింది. అక్కడి ప్రభుత్వం కావాల్సిన భూమిని సకాలంలో అప్పగించి పనులు స్టార్ట్​ చేసింది. నిర్మాణ పనులు పూర్తవడంతో ఈ వర్క్​షాపు త్వరలో ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే శుక్రవారం సికింద్రాబాద్ డివిజనల్ అడిషనల్ మేనేజర్ సుబ్రహణ్యం , ఇతర అధికారులు అయోధ్యపురంలో కేటాయించిన ల్యాండ్​ను పరిశీలించారు. భూమి అప్పగించిన మూడేళ్లలో ప్రాజెక్టును కంప్లీట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ కాజీపేటకు మంజూరైన పీవోహెచ్ షెడ్​ ఏర్పాటుకు మాత్రం
లీడర్లు, ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

15 రోజుల్లో ల్యాండ్ ​ఇచ్చేస్తం

పీవోహెచ్​ఏర్పాటుకు అవసరమయ్యే భూసేకరణ పూర్తి చేశాం. నిర్వాసితుల్లో కొంతమంది బ్యాంకు అకౌంట్ల విషయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాటిని కూడా క్లియర్​చేసి ప్రభుత్వానికి పంపించాం. పరిహారం చెల్లింపునకు సంబంధించిన జీవో కూడా ఇష్యూ అయ్యింది. పదిహేను రోజుల్లోగా ల్యాండ్ అప్పగించేలా చర్యలు తీసుకుంటాం.

– రాజీవ్​గాంధీ హన్మంతు, జిల్లా కలెక్టర్, వరంగల్​అర్బన్​