ములుగు/ ఏటూరునాగారం/ తాడ్వాయి, వెలుగు: అడవుల్లో దొరికే వనరులతో ఆయా మండలాల్లోని స్థానికులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం తాడ్వాయి మండలం కన్నెపల్లి సారలమ్మ ఆలయాన్ని సందర్శించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్థానిక వృద్ధులు, గ్రామస్తులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ కార్యాలయ ఆవరణలో పంచాయతీరాజ్ నిధులు రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేయనున్న వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ కోసం శంకుస్థాపన చేశారు.
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ములుగు, ఏటూరునాగారంలో క్రైస్తవులతో కలిసి కేక్‌కట్ చేశారు. ఏటూరునాగారం ఐటీడీఏ ఆఫీస్‌లో కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీవో చిత్రమిశ్రాలతో కలిసి 38మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాట్లాడుతూ దట్టమైన అటవీ ప్రాంతమైన కన్నేపల్లిలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేయడం జరుగుతుందని, గ్రామస్తులకు స్థానికంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు.
గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. క్రిస్మస్వేడుకల్లో పాల్గొని ప్రతీ ఒక్కరూ సహృద్భావంతో మెలగాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ శుభకాంక్షలు తెలిపారు. ములుగులోని వెజ్, నాన్ వెజ్ మార్కెట్ స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, మున్సిపాలిటీ నేపథ్యంలో బండారుపల్లి, జీవంతరావుపల్లి, జాతీయ రహదారికి ఇవతలవైపు ఉన్న ప్రజల అవసరాలకు అనుగుణంగానే ఈమార్కెట్ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, మార్కెట్‌కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి.రవిచందర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పాల్గొన్నారు.
