ములుగు, వెలుగు: ఆదివాసి గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం 29 ఎకరాల భూమిని సేకరించింది. భూదాతలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క బుధవారం రాత్రి చెక్కులు పంపిణీ చేశారు. ములుగు కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర్ ఆధ్వర్యంలో 16 మంది భూమిని అందించిన వారికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.2.20 కోట్లు పంపిణీ చేశారు. మిగిలిన మొత్తాన్ని రెండు రోజుల్లో అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
మహా జాతరలో అభివృద్ధి పనులకు గాను ఈ భూమిని కేటాయించినట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. జాతరలో శాశ్వత నిర్మాణాలు చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చేయాలనే మంచి ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు మేడారం గ్రామ ప్రజలు వారి భూములు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ములుగు ఆర్డీవో వెంకటేశ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు పాల్గొన్నారు.
