కేజీఎఫ్ గోల్డ్ మైనింగ్ లో విషాదం

కేజీఎఫ్ గోల్డ్ మైనింగ్ లో విషాదం

కేజీఎఫ్ లో విషాదం చోటు చేసుకుంది. గనుల్లో బంగారం దొంగతనం చేసేందుకు వెళ్లిన ఐదుగురిలో ముగ్గురు మరణించారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా మారి కుప్పం వద్ద  మూసిసేసిన కేజీఎఫ్ ( కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్ )  బంగారం  దొంగతనానికి వెళ్లిన ఐదుగురులో ముగ్గురు మృత్యువాత పడ్డారు. 100 అడుగుల లోతుకు వెళ్లిన ముగ్గురికి ఊపిరి ఆడక మృతి చెందినట్లు తెలుస్తోంది.  

కేజీఎఫ్ ఎస్పీ సుజీతా సల్మాన్ తెలిపిన వివరాల ప్రకారం..

మార్చి 1 నుంచి కేజీఎఫ్ లో ఉన్న భారత్ గోల్డ్ మైన్స్ (బీజీఎంఎల్ ) మూసేశారు. అప్పటి నుంచి మైన్స్ లో బంగారాన్ని దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా  స్కంద (55), జోసెఫ్ (45), మరో గుర్తు తెలియని వ్యక్తి, స్కంద కుమారుడు పాదయప్ప, సంతోష్ లు బీజీఎంఎల్ గనుల్లో బంగారాన్ని దొంగతనం చేసేందుకు   ప్రయత్నించారు. పాదయప్ప, సంతోష్ లు తాడు సాయంతో  స్కంద, జోసెఫ్, మరో గుర్తు తెలియని వ్యక్తుల్ని గనుల లోపలికి పంపించారు. సరిగ్గా 100 అడుగులకు వెళ్లే సరికి గనుల్లోకి వెళ్లిన ఆ ముగ్గురికి ఊపిరి ఆడలేదు. దీంతో  ప్రాణ భయంతో స్కంద తన కుమారుడు  పాదయప్పకు ఫోన్ చేసి..లోపల ఊపిరి ఆడడం లేదని.. కాపాడమని వేడుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన పాదయప్ప కేజీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో గనుల లోపలికి వెళ్లి బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఊపిరి ఆడకపోవడంతో ముగ్గురు మృతి చెందారని, వారిలో స్కంద, జోసెఫ్ డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సల్మాన్ అన్నారు. మరో గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీకోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేసినట్లు తెలిపారు.  

దొంగతనాలపై కేజీఎఫ్ సినిమా ప్రభావం ఉందా

 కోలారు బంగారు గనులు అంటే మనకు ముందుకు గుర్తు \కు వచ్చేది కేజీఎఫ్ సినిమా.  కర్ణాటక రాష్ట్రంలో ఇవి బెంగళూరుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కేజీఎఫ్ గనులపై సినిమా తెరకెక్కింది. 

కన్నడ సూపర్ స్టార్ యష్‌ హీరోగా  పెదరికంలో పుట్టిన హీరో.. అందరికంటే ధనవంతుడిగా ఎదగాలనుకోవడం.. మహారాజులా చనిపోవాలి అనే కన్నతల్లి చివరి కోరికను నెరవేర్చడం కోసం.. డబ్బు కోసం ఏపనైనా చేసే ఓ వ్యక్తి కథ తో  కోలార్‌ గనులను జోడించడంతో.. భారీ స్థాయిలో హైప్‌ వచ్చి.. ఇండియన్‌ సినిమాగా రూపొందింది. 

ఆ సినిమాలో కోలార్ గనుల్లో బంగారం పై బాగా  హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో వందలాది మంది కొలార్ గనుల్లో బంగారాన్ని దొంగతనం చేసేందుకు ప్రయత్నం చేశారు. తాజాగా ఈ ముగ్గురు అదే బంగారం కోసం ప్రయత్నం చేసి ప్రాణాలు పోగొట్టొకోవడంతో  విషాదం చోటు చేసుకుంది.