
- పుణెలో కూలిన బ్రిడ్జి.. నలుగురు మృతి
- 35 నుంచి 40 మంది గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- ఇంద్రాయణి నదిపై పురాతన ఐరన్ బ్రిడ్జి
- కుండమాల వాటర్‌ఫాల్‌గా ప్రసిద్ధి
- ప్రమాదం జరిగినప్పుడు వంతెనపై 130 మంది టూరిస్టులు
- 40 ఏండ్ల కింద వంతెన నిర్మాణం
- ప్రమాదంపై మహారాష్ట్ర సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ
పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ పురాతన వంతెన ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. 35 నుంచి 40 మంది టూరిస్టులు నదిలో కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. పుణె జిల్లా మావల్ మండలం తలెగావ్ దాభాడే వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటక ప్రాంతమైన కుండమాలకు ఆదివారం పెద్ద సంఖ్యలో టూరిస్టులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే బ్రిడ్జి కూలిపోగా అధికారులు వెంటనే అప్రమత్తమై రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ప్రమాదంలో 40 మంది వరకు గాయపడినట్లు తెలుస్తున్నది. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రమాదంపై సీఎం దేవంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయన్నారు. గల్లంతైన వారి కోసం నదిలో గాలిస్తున్నట్లు చెప్పారు. కూలిపోయిన బ్రిడ్జి శిథిలాలను క్రేన్ సహాయంతో తొలగిస్తున్నట్లు వివరించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఇంద్రాయణి నది
పుణె జిల్లా పింప్రి–చించ్వాడా పరిధిలోని కుండమాల గ్రామ సమీపంలో ఉన్న ఇంద్రాయణి నదిపై ఓ పురాతన ఐరన్ బ్రిడ్జి ఉంది. ఐదేండ్ల కింద దీనికి రిపేరు చేయించి వాడుకలోకి తీసుకొచ్చారు. వంతెన కింద ఎటూ చూసినా రాళ్లు ఉంటాయి. ఘాట్ ఏరియా కావడంతో ఎగువన వర్షాలు పడ్డప్పుడు ఈ ప్రాంతం చాలా అందంగా కనిపిస్తుంటుంది. రాళ్ల మధ్య నుంచి నీళ్లు ప్రవహిస్తుంటాయి. రెండు రోజులుగా మహారాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇంద్రాయణి నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
30 మందిని రక్షించిన గ్రామస్తులు
ఈ బ్రిడ్జి సుమారు 40 ఏండ్ల కింద కట్టినట్లు తెలుస్తున్నది. ఈ వంతెన పైనుంచే రైతులు... కుండమాల గ్రామం నుంచి తమ పొలాలకు వెళ్తుంటారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న వంతెన ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సడెన్గా కూలిపోయింది. ఆ టైంలో బ్రిడ్జిపై సుమారు 130 మంది పర్యాటకులు ఉన్నారు. వీరిలో 35 నుంచి 40 మంది ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తున్నది. మరో 40 మంది వరకు గాయపడ్డారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కుండమాల గ్రామస్తులు, పోలీసులు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 30 మందిని రక్షించి సేఫ్‌గా ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రమాదానికి గల కారణం అడిగి తెలుసుకున్నారు.
మహారాష్ట్రలో కుండపోత
మహారాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి దాకా 8 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. కోస్టల్ జిల్లాల్లో కురుస్తున్న కుండపోతకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది పిడుగుపాటుకు గురయ్యారు. కోస్టల్ జిల్లాలైన రత్నగిరి, రాయ్‌గఢ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పాల్ఘర్, ఠాణే, సింధ్‌దుర్గ్, పుణెలోని ఘాట్ ఏరియాలు, సతారా, కోల్హాపూర్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదివారం 11 వరకు గడిచిన 24 గంటల్లో రత్నగిరిలో అత్యధికంగా 8.10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాయ్‌గఢ్‌లో 6.50, సింధ్‌దుర్గ్‌లో 4.30, ఠాణెలో 2.9 సెంటీ మీటర్ల వాన పడింది. చాలా వరకు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
టూరిస్ట్ ప్లేస్లలో జాగ్రత్త: సీఎం దేవేంద్ర ఫడ్నవిస్
మృతుల కుటుంబాలకు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సంతాపం ప్రకటించారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కొన్నిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయని, టూరిస్ట్ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాటర్ ఫాల్స్, నదులకు దూరంగా ఉండాలన్నారు. ఈ ప్రమాదం దురదృష్టకరమని డిప్యూటీ సీఎంఏక్నాథ్ షిండే అన్నారు. కలెక్టర్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.
పురాతన బ్రిడ్జి కావడంతో ఇప్పటికే కొత్త వంతెన నిర్మాణానికి ఆర్డర్స్ ఇచ్చామని, అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. నదులపై ఉన్న అన్ని వంతెనలను పరిశీలించాల్సిందిగా ఆదేశించామన్నారు. బ్రిడ్జిపై టూరిస్టులను నిషేధించినప్పటికీ.. అధికారులు సరిగ్గా అమలు చేయలేదని ఎన్సీపీ ఎమ్మెల్యే సునీల్ షెల్కే తెలిపారు.