హైదరాబాద్ లో ‘కరెంట్’ కల్లోలం...గాలివానకు వణుకుతున్న జనం.. ‘మాన్సూన్ ప్లాన్’ కాగితాలకే పరిమితం..!

హైదరాబాద్ లో ‘కరెంట్’ కల్లోలం...గాలివానకు వణుకుతున్న జనం.. ‘మాన్సూన్ ప్లాన్’ కాగితాలకే పరిమితం..!
  •     తొలి వర్షాలకే నలుగురి దుర్మరణం
  •     కరెంటోళ్ల నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం

హైదరాబాద్ సిటీ, వెలుగు:  కరెంటోళ్ల నిర్లక్ష్యం అమాయకులను బలిదీసుకుంటోంది. హైదరాబాద్​సిటీలో వర్షాకాలం మొదలైన నాలుగు రోజుల వ్యవధిలోనే విద్యుత్ షాక్​తో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో రోడ్ల వెంట చెట్లు విరిగి విద్యుత్​ తీగలపై పడుతున్నాయి. ఫలితంగా స్తంభాలు వంగడం, విరగడం వంటి ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. విద్యుత్​శాఖ అధికారుల పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వరుస ప్రమాదాలు..

సిటీలో గాలివాన మొదలైందంటే చాలు నగరవాసులు వణికిపోతున్నారు. ఏ రోడ్డు మీద ఏ కరెంట్ వైర్​ తెగిపడుతుందో.. ఎక్కడ కరెంట్​ షాక్​తగిలి చనిపోతామో తెలియక ఇంటి నుంచి బయటికి రావడానికే జంకుతున్నారు. బండ్లగూడలో గత మంగళవారం సాయంత్రం కురిసిన భారీ గాలివానకు విద్యుత్ వైర్ తెగి రోడ్డు పక్కనున్న నీటి కుంటలో పడింది. అదే సమయంలో అక్కడికి చాయ్​తాగేందుకు వచ్చిన ఆటోడ్రైవర్​అఫ్రోజ్(30), తొమ్మిదో తరగతి విద్యార్థి జాఫర్(15) ఆ నీటిలో కాలు పెట్టగానే కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. 

శనివారం తెల్లవారుజామున కరెంట్​వైర్లు తండ్రీకూతురిని బలి తీసుకున్నాయి. మేడ్చల్​జిల్లా అల్వాల్​టెలికాం కాలనీలో గాలివానకు చెట్టు కూలి, కరెంట్​తీగలపై పడటంతో అవి తెగి కిందపడ్డాయి. ఇది గమనించక తమ కారును పక్కకు తీసేందుకు వచ్చి చౌదరి సందీప్(45), ఇంటర్​చదివే ఆయన కూతురు రితిక(16) విద్యుత్​షాక్​కు గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. 

మాన్సూన్ ప్లాన్ ​ఏమైనట్టు?

వర్షాకాలం ప్రారంభానికి ముందే విద్యుత్​శాఖ ఆఫీసర్లు​మాన్సూన్​ ప్లాన్ అమలు చేయాలి. కానీ, గ్రేటర్​హైదరాబాద్ పరిధిలో విద్యుత్​సరఫరా చేసే దక్షిణ డిస్కం(టీజీఎస్పీడీసీఎల్) అధికారులు పట్టించుకోవడం లేదని నగర వాసులు ఆరోపిస్తున్నారు. గాలివానకు కరెంట్ తీగలు తెగి కిందపడటంతోనే ట్రాన్స్ ఫార్మర్​ వద్ద ఫీజులు పోయి, రెప్పపాటులో విద్యుత్​సప్లై  ఆగిపోవాలి. ఆ విధంగా ఆఫీసర్లే ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే, ట్రాన్స్​ఫార్మర్లను, సబ్​ స్టేషన్ల వద్ద విద్యుత్​వ్యవస్థను, రోడ్ల వెంట, వీధుల్లో విద్యుత్ తీగలకు తగిలేలా ఉన్న చెట్ల కొమ్మలను తొ లగించడం, లూజ్​ వైర్లను సరిచేయడం వంటి వాటిని పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు అంటున్నారు. టీజీఎస్పీడీసీఎల్​ పరిధిలో వేలాది మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు పని చేస్తున్నా వినియోగదారుల సమస్యలను చూడరని చెబుతున్నారు.  

కోట్లలో కరెంట్​ బిల్లులు.. భద్రత ఏదీ?

ప్రతీ నెల రూ.3 వేల కోట్లకు పైగా కరెంట్​బిల్లులు చెల్లించే గ్రేటర్​హైదరాబాద్​లో ఎలాంటి భద్రత వ్యవస్థ లేకపోవడం విడ్డూరంగా ఉందని నగరవాసులు మండిపడుతున్నారు. నగరంలో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెడ్ విద్యుత్ లైన్లను పూర్తిగా తొలగించి, అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్ కేబుల్​వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంటున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి, విద్యుత్ నిలిపివేసేలా 24/7 హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ నంబర్లను సమర్థవంతంగా నిర్వహించడం లేదని ఆరోపిస్తున్నారు. 

అల్వాల్​ఘటన తర్వాత.. భారీ వర్షాల సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడితే తాకకుండా వెంటనే 1912 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేయాలని పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిపై సోషల్​మీడియాలో ట్రోలింగ్​జరుగుతోంది. హెల్ప్​లైన్​కు ప్రతీరోజు వందలు, వేల సంఖ్యలో కంప్లైంట్స్​వస్తుంటే పట్టించుకోని దక్షిణ డిస్కం ఆఫీసర్లు.. జాగ్రత్తలు చెబుతున్నారంటూ పోస్ట్​లు పెడుతున్నారు.