4 గంటలు నాన్ స్టాప్..హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం

4 గంటలు నాన్ స్టాప్..హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం
  • రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ వర్షం
  • సంగారెడ్డి జిల్లా పుల్కల్​లో 12 సెంటీ మీటర్ల వర్షపాతం
  • హైదరాబాద్ బాలానగర్​లో 11.53 సెంటీ మీటర్లు
  • రంగారెడ్డి జిల్లాలో గోడ కూలి మహిళ మృతి
  • అధికారులందరూ అలర్ట్​గా ఉండాలి: సీఎం రేవంత్

హైదరాబాద్/ ఇబ్రహీంపట్నం, వెలుగు: హైదరాబాద్​లో వాన దంచికొట్టింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల పాటు గ్యాప్ ఇవ్వకుండా పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు, షాపులు, కాలనీల్లోకి నీరు చేరి జనాలు ఇబ్బందిపడ్డారు. పలు ప్రాంతాల్లో వాహనాలు నీటమునిగాయి. చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాలానగర్​లో అత్యధికంగా 11.53 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆరాంఘర్ వద్ద వరదలో బస్సు చిక్కుకున్నది. ప్యాట్నీ నాలా పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అదేవిధంగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జోరు వాన కురిసింది. 

హైదరాబాద్​లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బోట్​లో తిరిగి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇండ్లలో చిక్కుకున్న వారిని డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్ల షోరూంలో చిక్కుకున్న 30 మంది కార్మికులను బోట్ల ద్వారా తరలించారు. కుండపోత వర్షం కారణంగా ఐటీ కారిడార్ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. బయో డైవర్సిటీ జంక్షన్ ప్రిస్టన్​మాల్ వద్ద రోడ్డుపై భారీగా వర్షపునీరు చేరి కార్లు నీట మునిగాయి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్లోని ఎల్ఆర్ ఎన్​క్లేవ్ వెంచర్ వైపు ప్రహరీ గోడ కూలడంతో రమావత్ లక్ష్మి (35) చనిపోయింది. గోడను ఆనుకుని కట్టుకున్న గుడిసెలో లక్ష్మి నివాసం ఉండేది. ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మిది నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి గ్రామం కొత్తూరు తండా స్వస్థలం.

జిల్లాల్లోనూ అతిభారీ వర్షాలు

నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, జనగామ, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నాలుగైదు జిల్లాలు మినహా శుక్రవారం రాష్ట్రమంతటా వర్షపాతం రికార్డయింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్​లో 12 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా ధర్మసాగర్​లో 10.1 సెంటీ మీటర్లు, యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో 10.6, రంగారెడ్డి జిల్లా కందువాడలో 10.6, మంగళపల్లిలో 9.7, మెదక్ జిల్లా రామాయంపేటలో 9.6, యాదాద్రి జిల్లా కొలనుపాకలో 9.2, వికారాబాద్ జిల్లా నవాబుపేటలో 8.9, సంగారెడ్డి జిల్లా పల్వట్లలో 8.4, మెదక్​లో 8.3, జనగామ జిల్లా కోల్కొండలో 8.1 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 57 ప్రాంతాల్లో 7 సెంటీ మీటర్లకుపైగానే వర్షపాతం నమోదైనట్టు తెలంగాణ డెవలప్​మెంట్ అండ్​ ప్లానింగ్​ సొసైటీ రియల్​టైం డేటా తెలిపింది.

సమన్వయంతో పని చేయాలి: సీఎం రేవంత్​

వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్​వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలిచ్చారు.

క్యుములో నింబస్​మేఘాలొచ్చి కుండపోత 

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు.. వాతావరణ శాఖ అధికారులకు కూడా అంతుచిక్కట్లేదు. పొద్దంతా ఎండలు కొట్టినా.. మధ్యాహ్నం ఒక్కసారిగా మబ్బులు కమ్మేస్తున్నాయి. క్యుములో నింబస్​ మేఘాలొచ్చి కుండపోత కురిపిస్తున్నాయి. ఉపరితల గాలులు, ద్రోణి ప్రభావంతో ఉన్నట్టుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నట్టు చెప్తున్నారు. దీంతో మొదట ఎల్లో అలర్ట్​ను జారీ చేస్తున్న వాతావరణ శాఖ కాస్తా.. అప్పటికప్పుడు ఆరెంజ్​ అలర్ట్ అని సవరించుకోవాల్సి వస్తున్నది. రానున్న 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది.