- మహిళలకు మరింత భద్రత
- అందరికీ కనీస వేతనాలు
న్యూఢిల్లీ:గిగ్‌వర్కర్లు, ఫ్లాట్‌ఫామ్ వర్కర్లు వంటి అసంఘటిత రంగ కార్మికులకు మరిన్ని ప్రయోజనాలు అందించే నాలుగు లేబర్ కోడ్స్‌ను శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిని నోటిఫై చేసినందున చట్టాలుగా మారాయని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు.
కార్మికుల సంక్షేమానికి ఇందులో మరింత ప్రాధాన్యం ఇచ్చామని, గతంలోని 29 చట్టాలను ఇవి భర్తీ చేస్తాయని తెలిపారు. పాత చట్టాల్లో రూల్స్‌కు కాలం చెల్లిందని, అందుకే వీటిని తీసుకొచ్చామని మంత్రి వివరించారు. ఈ చరిత్రాత్మక చట్టాలకి 2020లోనే ఆమోదం దక్కిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త లేబర్ కోడ్స్‌ను ప్రశంసించారు. ఇవి ప్రగతిశీల కార్మిక సంస్కరణలని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
ఇక 12 గంటల పని...
కార్మికుల పనివేళలను రోజుకు 12 గంటల వరకు పెంచే వీలు కల్పించారు. వారంలో మొత్తం పనిగంటల్లో (48 గంటలు) మాత్రం మార్పు ఉండదు. వారంలో నాలుగు రోజులు పనిచేసి, మూడు రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు. మహిళా కార్మికులు రాత్రిపూట కూడా పని చేయవచ్చు. యాజమాన్యం వారి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ప్రయాణ సదుపాయమూ కల్పించాలి. పనిచేసే చోట సీసీ టీవీలు అమర్చాలి.
ఆర్జిత సెలవుల (ఎర్న్డ్లీవ్స్–ఈఎల్స్) పొందడానికి ఏడాదిలో చేయాల్సిన కనీస పని దినాలను 240 నుంచి 180 రోజులకు తగ్గించారు. ఒకేసారి తీసుకునే సెలవుల సంఖ్యను 30 కి పరిమితం చేశారు. ఈఎల్స్‌కు బదులు డబ్బు తీసుకునే (ఎన్‌క్యాష్) గడువును ప్రతి ఏడాది ముగింపు నుంచి ప్రతి రెండేళ్ల ముగింపునకు మార్చారు.
లింగ భేదం లేకుండా మగవాళ్లయినా, మహిళలు అయినా ఒకే పనికి లేదా ఒకే రకమైన పనికి ఒకే విధమైన జీతం పొందేలా నిబంధన తీసుకొచ్చారు. నిర్ణీత కాలానికి పనిచేసే (ఫిక్స్డ్-టర్మ్) కార్మికులకు కూడా గ్రాట్యుటీకి అర్హత కల్పించారు. దీనితో పాటు, గ్రాట్యుటీ లెక్కించడానికి కనీస సర్వీసు నిబంధనను కూడా తొలగించారు. అపాయింట్మెంట్లెటర్స్ ఇవ్వడం ఇక నుంచి తప్పనిసరి.
అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు, గిగ్ కార్మికులకు, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, భవిష్య నిధి (పీఎఫ్) వంటి సామాజిక భద్రతా పథకాలు వర్తిస్తాయి. కనీస వేతనాలు అమలు చేయాలి. జీతాల చెల్లింపును ఆలస్యం చేయకూడదు. ఐటీ కంపెనీలయితే ప్రతీ నెల ఏడు లోపే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి. కోత్త కోడ్స్ ప్రకారం, 40 ఏళ్లు పైబడిన వారికి యజమానులు ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ఆధార్ -లింక్డ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ ద్వారా దేశంలో ఎక్కడ పనిచేసినా వెల్ఫేర్ బెనిఫిట్స్ పొందొచ్చు.
కార్మికుడిని తొలగించినప్పుడు, రాజీనామా చేసినప్పుడు రెండు పనిదినాలలోపు పూర్తి వేతనం చెల్లించాలి. ఒక పరిశ్రమలో 51 శాతం మందికి పైగా కార్మికుల మద్దతు ఉన్న ట్రేడ్ యూనియన్ లేదా సమాఖ్యకు ఏకైక బేరసారాల ప్రతినిధి (సోల్బార్గేనింగ్ ఏజెంట్) హోదాను ఇవ్వాలి.
కొత్త కోడ్స్ ఇవే:
- వేజ్ కోడ్ (2019)
- ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ (2020)
- సోషల్ సెక్యూరిటీ కోడ్ (2020)
- ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ (2020)
