
- మంత్రి అడ్లూరికి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: దివ్యాంగ ఉద్యోగులకు ఆర్ పీ డబ్ల్యూడీ యాక్ట్ 2016 ప్రకారం పెంచిన 4 శాతం రిజర్వేషన్లను అన్ని డిపార్ట్మెంట్లలో కేటగిరీల వారీగా అమలు చేయాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య విజ్ఞప్తి చేశారు. ప్రమోషన్లలో ఉన్న నిబంధనను తొలగించాలని, జీవో 317 బాధితులు తక్షణమే వారి సొంత స్థలాలకు బదిలీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రిని కోరారు.
శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లో డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి అసోసియేషన్ నేతలు, దివ్యాంగులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. దివ్యాంగ ఉద్యోగులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఆన్ డ్యూటీ సౌకర్యంతో కూడిన వెసులుబాటును కల్పించాలని, దివ్యాంగ ఉద్యోగులకు అదనపు సీఎల్ లను మంజూరు చేయాలని, అన్ని రకాల కేటగిరీ దివ్యాంగులకు 10 లోపు రోస్టర్ పోస్టులను కేటాయించాలని నేతలు వినతిపత్రంలో మంత్రిని కోరారు.
రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారని ముత్తినేని తెలిపారు. ఈ నెల 16న సమస్యలపై చర్చించటానికి తనతో పాటు స్ర్తీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ, డైరెక్టర్‌తో కలిసి మీటింగ్ నిర్వహిస్తానని తెలిపారని ఆయన వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో షేక్ హబీబ్ మియా, చిరబోయిన లక్ష్మయ్య, ముక్కు నర్సయ్య , మొక్క వెంకట నర్సయ్య తో పాటు పలవురు నేతలు ఉన్నారు.