ట్రాఫిక్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరం.. హైదరాబాద్ గురించి త్రిపుర సీఎంకు చెబుతా: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ట్రాఫిక్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరం.. హైదరాబాద్ గురించి త్రిపుర సీఎంకు చెబుతా: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ట్రాఫిక్ నిర్వహణకు, అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం అని అన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. భద్రతను కాపాడటం, ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం అందరి సమిష్టి కృషి కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో నిర్వహించిన ట్రాఫిక్ సమ్మిట్-2025 కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఆయన.. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిర్వహణ, అభివృద్ధి గురించి తమ రాష్ట్రం త్రిపుర సీఎంకు చెబుతానని అన్నారు.

ఇండియాలో గత పదేళ్లలోనే జాతీయ రహదారులు 60% వరకు విస్తరించాయని చెప్పిన గవర్నర్.. హైదరాబాద్ ఈ ఆధునిక కనెక్టివిటీకి ఒక గర్వకారణం అని అన్నారు. రోడ్డుపై క్రమశిక్షణ ఉన్న చోట ప్రాణానికి రక్షణ ఉంటుందని చెప్పారు. 

హైదరాబాద్ నగరంలో నూతన కనెక్టివిటీ అద్భుతంగా ఉందని చెప్పిన గవర్నర్.. ఫ్లైఓవర్లు, మెట్రో రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌ వేలు మన ప్రగతికి నిదర్శనం అని అన్నారు. అయినా కూడా భద్రతా విషయంలో ఎప్పుడూ అత్యున్నత ప్రాధాన్యతగా ఉండాలని సూచించారు. 

తెలంగాణ  ప్రభుత్వం హైవేలు, రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ వేలు, ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది.. మరోవైపు మన నగరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లోనే రోజుకు 1500 వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి.  ఇది కేవలం హైదరాబాద్‌ కథ కాదు, మొత్తం భారతదేశం ఇదే పరిస్థితి ఉందని అన్నారు.

తాను ఈశాన్య  రాష్ట్రాలకు చెందినవాడినని చెప్పిన గవర్నర్.. తన చిన్న రాష్ట్రం త్రిపుర రాజధాని అగర్తలాలో ఒకప్పుడు ట్రాఫిక్ ఉండేది కాదని.. కానీ నేడు అక్కడ కూడా ట్రాఫిక్ జామ్‌లు కనబడుతున్నాయని అన్నారు. షిల్లాంగ్‌లో కూడా అదే పరిస్థితి ఉందని చెప్పారు. ఇది అభివృద్ధి కథ, క్రమశిక్షణ కథ. ఈ సమస్యను పరిష్కరించే ఏకైక మార్గం – ప్రజల భాగస్వామ్యం అని అన్నారు. 

టెక్నాలజీని, AIని, కంప్యూటర్లను, రోడ్లపై కెమెరాలను, మరిన్ని టెక్నాలజీ ఉపకరణాలను పోలీసులను ఉపయోగించవచ్చునని చెప్పారు. హైదరాబాద్ ప్రభుత్వం, ట్రాఫిక్ సిబ్బంది నిర్వహిస్తున్నది  ఒక మహోన్నతమైన ప్రయత్నమని.. తన రాష్ట్రానికి తిరిగి వెళ్ళిన తరువాత ఈ విషయాన్ని త్రిపుర ముఖ్యమంత్రికి చెబుతానని అన్నారు. 

 ట్రాఫిక్ మాత్రమే కాదు, ప్రతి అభివృద్ధి ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యం కావాలి అని తాను గాఢంగా నమ్ముతానని అన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్‌గా వచ్చినప్పుడు పలు జిల్లాలను సందర్శించాని చెప్పిన ఆయన.. ప్రతి సమావేశంలో ప్రభుత్వాధికారులు, జిల్లా అధికారులు మాత్రమే కాకుండా ఆ జిల్లా ప్రముఖులు కూడా పాల్గొనాలని సూచించారు. వాళ్లకు కూడా జిల్లా లో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలియాలి.ఈ మంచి పనిలో తాను కూడా భాగస్వామి కావడం గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నారు.

ప్రజల భాగస్వామ్యం ఉండటంపై హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఒక  గొప్ప ఉదాహరణ అని కొనియాడారు. 2047 వైపు అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు వెళ్తన్న మనకు ఉన్న పెద్ద సవాళ్లలో ఒకటి ట్రాఫిక్‌ నిర్వహణ ఒకటి అని అన్నారు. 

హైదరాబాద్‌ నగరం నిజాం కాలం నాటి ఎంతో పాత నగరం అని..  కొత్త నగరాలు, కొత్త మౌలిక సదుపాయాలు నిర్మిస్తున్నప్పుడు పాత నగరం కూడా సమానంగా అభివృద్ధి చెందాలని సూచించారు. పాత ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం అభివృద్ధి కాదని అన్నారు. పాతనగరంలో ఉన్నా, కొత్తనగరంలో ఉన్నా, భవిష్యత్ లో ఎక్కడ ఉన్నాజీవన సౌలభ్యం అందరికీ ఉండాలని చెప్పారు. 

మనం టెక్నాలజీ, AI అన్నీ చేతిలోకి తెచ్చుకున్నామని..  ఇప్పుడు అవగాహన కల్పించడమే మన బాధ్య అని అన్నారు. ప్రభుత్వం పనిచేస్తుంటే మనం కేవలం చూస్తూ ఉంటే సరిపోదని అన్నారు. ప్రభుత్వం చూసుకుంటుంది, నేను ఓటు వేశాను.. నా పని అయిపోయింది.. అనే ధోరణి అభివృద్ధి చెందిన దేశంలో సరిపోదని అభిప్రాయపడ్డారు. 

అందరూ కలిసి పనిచేస్తే టీమ్‌ వర్క్‌ అవుతుందని.. బాధ్యత పెరుగుతుందని.. బాధ్యత తీసుకోవడం నేర్చుకోవడంలోనే ఇదే హైదరాబాద్‌ ఆత్మను ఉందని చెప్పారు.  హైదరాబాద్‌ కేవలం హైటెక్ నగరం లేదా మల్టీస్టోరీ భవనాలతో ఉన్న నగరం మాత్రమే కాదని,  భద్రతా ప్రమాణాలలో తీసుకునే  చొరవలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఇలాంటి సదస్సులు ఇప్పుడు కేవలం కాగితాలపై పత్రాలు సమర్పించడానికి మాత్రమే కాదని.. ఆచరణలో చూపాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారు. 

ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, AI, టెక్నాలజీ సదస్సు గురించి మాట్లాడుతున్నప్పటికీ మనం మాట్లాడేది మనుషుల గురించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపైనే అన్న సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు. ఇండస్ట్రీ వర్గాలు ఈ సదస్సుకు సహకరించడం చాలా మహోన్నతమైన విషయమని.. వారికి అభినందనలు చెబుతున్నట్లు తెలిపారు. టీ-హబ్, టీ-వర్క్స్‌లాగా – పోలీస్ శాఖకు కూడా దేశమంతటికి ఆదర్శంగా నిలిచే ఒక మోడల్ ఇక్కడి నుంచే మొదలు కావాలని సూచించారు.