కామారెడ్డి జిల్లాలో సేంద్రియ సాగుకు 4 గ్రామాల ఎంపిక

కామారెడ్డి జిల్లాలో సేంద్రియ సాగుకు 4 గ్రామాల ఎంపిక

 

  • ఎరువుల తయారీ, సీఆర్​పీల వేతనాలు తదితర వాటికి రూ.40 లక్షలు కేటాయింపు
  • మహిళా సంఘాల నుంచి సీఆర్​పీల ఎంపిక
  • అధిక దిగుబడి తీసేలా చేపట్టనున్న అవగాహన కార్యక్రమాలు

కామారెడ్డి​, వెలుగు :  సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహిస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని అవగాహన కల్పిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రెండు మండలాల్లో 4 గ్రామాలను ఎంపిక చేయగా, సమీకృత వ్యవసాయ క్షేత్రాల  (ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్లు)  ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. రైతులతో పాటు, మహిళా సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుతోంది. 

వ్యవసాయ ఉత్పత్తులు పెంచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కసరత్తు ప్రారంభించాయి. ఎంపికైన గ్రామాల్లో  మహిళా సంఘాల సభ్యులను సీఆర్​పీ ( క్లస్టర్​ రిసోర్స్​ పర్సన్​)గా ఎంపిక చేశారు. వీరికి ఫస్ట్ విడతలో ట్రైనింగ్​ కూడా ఇచ్చారు.  ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్లకు సంబంధించి ఎంపికైన గ్రామాల డీపీఆర్​ను ఇప్పటికే ఉన్నతాధికారులకు పంపినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు పేర్కొంటున్నారు. 

తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్, కృష్ణాజివాడి,  దోమకొండ మండలం ముత్యంపేట, చింతమాన్​పల్లి గ్రామాలు ఎంపికయ్యాయి. ఈ గ్రామాల్లో రసాయనిక ఎరువులు, ఫెస్టిసైడ్స్ తగ్గించి సేంద్రియ ఎరువులు వాడి అధిక దిగుబడులు సాధించేలా మహిళా సంఘాలు చర్యలు తీసుకోనున్నాయి. వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళలనే సీఆర్​పీలుగా ఎంపిక చేశారు. ఒక్కో ఊరుకు ఒక్కో సీఆర్​పీ ఉంటారు.

  వీరికి ఇది వరకే ట్రైనింగ్ ఇవ్వగా, మరో సారి శిక్షణ ఇవ్వనున్నారు.  సీఆర్​పీలు సేంద్రియ ఎరువుల తయారీ,  కషాయాల తయారీ, సాగు విధానాన్ని తెలుపనున్నారు.  గ్రామాల్లో అధికారులు,  నిపుణులతో కలిసి రైతులకు శిక్షణ ఇప్పించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఇందుకుగాను 4 గ్రామాలకు కలిపి ప్రభుత్వం రూ.40 లక్షలు కేటాయించింది. సీఆర్​పీల వేతనం,  ట్రైనింగ్,  సేంద్రియ ఎరువుల తయారీకి అవసరమైన పరికరాలు, ముడిసరుకు కొనుగోళ్లకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.   

సేంద్రియ సాగుకు మొగ్గు చూపేలా..  

కామారెడ్డి జిల్లాలో సాగుకు అధికంగా రసాయనిక ఎరువులను వాడుతున్నారు. తెగుళ్లు సోకినప్పుడు ఫెస్టిసైడ్స్​ వినియోగిస్తున్నారు. ఫలితంగా నేలలో సారం కోల్పోయి దిగుబడి తగ్గుతోంది.  ఈ సమస్యను అధిగమించి  సేంద్రియ సాగు వైపు రైతులు మొగ్గు చూపేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు.  వ్యవసాయ శాఖ నిర్దేశించిన ప్రకారం  జిల్లాలోని 4 గ్రామాలను ఇంటిగ్రేటెడ్​ ఫార్మింగ్​ క్లస్టర్లుగా ఐకేపీ అధికారులు ఎంపిక చేశారు. 

 కృష్ణాజివాడి, ఎర్రపహాడ్​, ముత్యంపేట, చింతమాన్​పల్లి గ్రామాలుఉన్నాయి.  ఈ గ్రామాల్లో ప్రధానంగా వరి, మక్క, సోయా, కూరగాయలు, పత్తి సాగు చేస్తారు.   ఒక్కో గ్రామంలో 5‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌00 నుంచి  వెయ్యి ఎకరాలు సాగవుతున్నాయి. అవగాహన కల్పిస్తే సేంద్రియ సాగు చేపట్టనున్నారని అధికారులు భావిస్తున్నారు. 3 నుంచి 4 ఏండ్ల పాటు అవగాహన కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉంది.

ఉపాధి అవకాశాలు మెరుగు 

సేంద్రియ సాగును ప్రోత్సహిస్తే తక్కువ పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడులు పెరగనున్నాయి. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల రైతులు, మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.  పంట ఉత్పత్తుల అమ్మకం, వాటి ప్రాసెసింగ్ చేయించి వాటి ద్వారా అధిక ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోనున్నారు.