బుగ్గిపాలైన బతుకులు.. శనిగకుంటలో వీధిన పడ్డ 40 కుటుంబాలు

బుగ్గిపాలైన బతుకులు.. శనిగకుంటలో వీధిన పడ్డ 40 కుటుంబాలు
  • కాలిపోయిన బంగారం, వెండి, డబ్బు
  • అగ్నికి ఆహుతైన స్టడీ సర్టిఫికెట్లు
  • రూ. 5 కోట్లకు పైగా ఆస్తి నష్టం

జయశంకర్‌‌ భూపాలపల్లి/ ఏటూరునాగారం, వెలుగు: ఎటు చూసినా కాలిపోయిన ఇండ్లు.. ఎవరిని కదిలించినా సర్వం కోల్పోయామంటూ ఆవేదన.. ఒక్క రాత్రిలో ప్రజల ఆశలన్నీ అడియాసలయ్యాయి. బిడ్డల పెళ్లి కోసం కొన్న బంగారు నగలు, బీరువాల్లో దాచుకున్న డబ్బు, వెండి వస్తువులు, వండుకోవడానికి ఇంట్లో నిల్వ చేసిన బియ్యం, వడ్లు, కట్టుకునే బట్టలు, వండుకునే గిన్నెలు, పిల్లల స్టడీ సర్టిఫికెట్లు.. అన్నీ కాలి బూడిదయ్యాయి. ములుగు జిల్లా మంగపేట మండలం శనిగకుంట గ్రామంలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 24 ఇండ్లు కాలిపోగా 40 కుటుంబాలు వీధిన పడ్డాయి. ఉండటానికి ఇల్లు లేక.. కట్టుకోవడానికి బట్టల్లేక.. తినడానికి తిండి దొరకక రోదిస్తున్నారు.   

క్షణాల్లో ఊరంతా అంటుకుంది 

గురువారం రాత్రి శనిగకుంట గ్రామ సమీపంలోని చెరువు కట్టపై ఉన్న గడ్డికి సమీప అటవీ ప్రాంతం నుంచి ఎరగడి మంటలు వచ్చి అంటుకున్నాయి. గాలి కారణంగా ఇర్ప సంతోష్​ ఇంటిపై పడ్డ మంటలు క్షణాల్లో ఊరంతా వ్యాపించడంతో 24 ఇండ్లు పూర్తిగా కాలిపోయాయి. రెండు ఫైర్​ ఇంజన్లు రావడం లేటయ్యింది. అప్పటికే ఇండ్లన్నీ కాలిపోయాయి. గంట వ్యవధిలోనే 24 ఇండ్లు కాలిపోవడంతో గ్రామంలో సుమారు రూ. 5 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఆదివారం వరకు పూర్తి నష్టం తెలుస్తుందని అంటున్నారు. శుక్రవారం గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్​ కృష్ణ ఆదిత్య బాధిత కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రెవెన్యూ, ఐటడీఏ శాఖల ద్వారా నష్ట పరిహారం, డబుల్​ బెడ్రూం ఇండ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, బియ్యం తదితర వస్తువులను కలెక్టర్​ పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క గ్రామాన్ని సందర్శించి బాధితులకు బియ్యం, కొంత నగదు, దుప్పట్లు, బట్టలు పంపిణీ చేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే డబుల్​ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని, తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని కోరారు.  

కుటుంబానికి రూ.55 వేల సాయం

అగ్నిప్రమాదంతో నిరాశ్రయులైన వారికి నష్టపరిహారం అందిస్తామని, పునరావాస చర్యలు చేపడతామని మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం ప్రకటించారు. గిరిజన శాఖ నుంచి ఒక్కో కుటుంబానికి రూ.40 వేలు, రెవెన్యూ నుంచి రూ.15 వేల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని, 25 కిలోల బియ్యం, రూ.1,800 విలువైన వంట సామగ్రి కిట్ అందిస్తామని, పరిస్థితులు కుదుట పడేవరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

అన్నీ పోయినయ్​

మా ఇంటికి సమీపంలో ఉన్న కుంట కట్టకు అంటుకున్న ఎరగడి మంటలు ఈదురు గాలికి ఎగిరి మా ఇంటిపైన పడడంతో మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే చుట్టుపక్కల ఇండ్లకు పాకాయి. బీరువాలోని పొలం పట్టా పాస్​బుక్కు,  4 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 2 లక్షల పైసలు అన్నీ కాలిపోయినయ్.  ‒ ఇర్ప స్వప్న