ఒక్కో ఇంటి నుంచి రెండు అప్లికేషన్లు

ఒక్కో ఇంటి నుంచి రెండు అప్లికేషన్లు
  • మూడు రోజుల్లో 40 లక్షల అభయహస్తం దరఖాస్తులు
  • 6వ తేదీ నాటికి కోటిన్నర అప్లికేషన్లు వచ్చే చాన్స్​
  • రేషన్​కార్డు, ధరణి సమస్యలపై లక్షల్లో వినతులు
  • ప్రతి అర్జీని భద్రపర్చాలని ప్రభుత్వం ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం గ్యారంటీలకు ప్రజాపాలన కార్యక్రమంలో లక్షలాది అప్లికేషన్లు వస్తున్నాయి. సగటున ఒక ఇంటి నుంచి రెండేసి దరఖాస్తులు వస్తుండగా, కొత్త రేషన్ కార్డులు, ధరణి సమస్యలపైనా వినతులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో పట్టణాలు, గ్రామాలు కలుపుకొని మూడు రోజుల్లోనే 40 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన ప్రజాపాలన కార్యక్రమం ముగిసే ఈ నెల 6వ తేదీ నాటికి అప్లికేషన్ల సంఖ్య కోటిన్నర వరకు చేరే అవకాశం ఉన్నది. ఆది, సోమవారాలు సెలవుదినాలు కావడంతో అర్జీల స్వీకరణ ఆగింది. తిరిగి ఈ నెల 2వ తేదీ నుంచి 6 వరకు గ్రామ, వార్డు సభల్లో అర్హుల నుంచి అప్లికేషన్లు తీసుకోనున్నారు. చివరి నాలుగు రోజుల్లో ప్రజల నుంచి దరఖాస్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున.. తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. భారీగా అప్లికేషన్లు వస్తున్నందున ప్రతి దరఖాస్తును కంప్యూటరైజేషన్​ చేసే వరకు జాగ్రత్తగా భద్రపర్చాలని ఆదేశించింది. 
స్పష్టత లేక పెరుగుతున్న అర్జీలు..

రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీల అమలులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. అయితే సర్కారు విడుదల చేసిన దరఖాస్తు ఫారంలో కొన్ని అంశాలపై స్పష్టత లేక ఒక కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తున్నారు . ఉమ్మడి కుటుంబాలు ఎన్ని ? ఎలా దరఖాస్తు  సమర్పించాలనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో అప్లికేషన్ల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. తొలి రెండు రోజుల్లో 22 లక్షల మేర అర్జీలు వస్తే, మూడో రోజు18.29 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అభయ హస్తం గ్యారంటీ దరఖాస్తులో మొత్తం ఐదు గ్యారంటీలకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికే ఆసరా పెన్షన్లు, రైతుబంధు పొందుతున్నవాళ్లు కొత్తగా దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. 

రేషన్​కార్డు, ధరణి వినతులు

అభయహస్తం దరఖాస్తుకు రేషన్​ కార్డు, ఆధార్​కార్డు జత చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ రేషన్​కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.  రేషన్​ కార్డు కోసం తెల్లకాగితంపై అర్జీ పెట్టుకుంటే సరిపోతుందని చెప్పింది. దీంతో గ్యారంటీల దరఖాస్తుతో పాటు రేషన్​కార్డు కోసం పెట్టుకుంటున్న అప్లికేషన్లు కూడా ఎక్కువే ఉంటున్నాయి. ఇప్పటికే సివిల్​సప్లయ్స్​ డిపార్ట్​మెంట్ వద్ద దాదాపు 11 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు వారితో పాటు అర్హత ఉన్న కొత్తవాళ్లందరూ మళ్లీ వినతుల రూపంలో గ్రామ సభల్లో సమర్పిస్తున్నారు. ఇతర సమస్యలపైనా అప్లికేషన్లు తెల్లకాగితంపై రాసివ్వచ్చని సర్కారు చెప్పడంతో ధరణిలో ఉన్న సమస్యలపై కూడా ఎక్కువ మంది అప్లికేషన్లు ఇస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు గ్యారంటీ దరఖాస్తులు కాకుండా రేషన్​కార్డు, ధరణితో పాటు ఇతరత్రా సమస్యలపై 6 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి.

అయితే మహాలక్ష్మీ స్కీంలో భాగంగా 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతినెలా రూ.2500 ఆర్థిక సాయం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దీంతో ఒక్కో కుటుంబం నుంచి ఎంతమంది మహిళలు ఉంటే.. అంతమంది ఈ స్కీం కోసం సపరేటుగా ఎవరికి వాళ్లు అప్లికేషన్​ఇస్తున్నారు. ఇలా సగటును ఒక్కో ఫ్యామిలీ నుంచి రెండేసి దరఖాస్తులు వస్తున్నాయి. అదే సమయంలో రేషన్​ కార్డు లేకున్నప్పటికీ అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడంతో వివాహమై ఒకే ఇంట్లో ఉంటున్నోళ్లు కూడా గ్యారంటీలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రూ.500 కే గ్యాస్​ సిలిండర్​  ఛాన్స్​ఉండటంతో గ్యాస్​ కనెక్షన్​ నెంబర్​సపరేటుగా ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రెండు కేటగిరీలు ఉన్నాయి. ఇండ్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం కూడా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు.