
హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్‌తో పిల్లల ముందుకొచ్చిన వచ్చిన టీవీ బడికి సిటీలో దాదాపు సగం మంది దూరంగానే ఉన్నారు. సిటీవ్యాప్తంగా సర్కారు స్కూళ్లలో 82,250 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం వారిలో 10,600 మందికి టీవీ, స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేవు. నిజానికి అలాంటి పిల్లలు 20వేల మందికి దాకా ఉన్నారని టీచర్లు చెప్తున్నారు. మంగళవారం నుంచి డిజిటల్ క్లాసులు జరుగుతుండగా మొదటి రెండ్రోజులు 60శాతం స్టూడెంట్స్ మాత్రమే హాజరయ్యారు. టీవీలు, స్మార్ట్ఫోన్లు లేక కొందరు, నెట్ వర్క్ ఇష్యూస్, సరైన సమాచారం లేక ఇంకొందరు క్లాస్‌లు వినలేకపోయారు. దాంతో పాఠాలు మిస్ అయ్యామనే భయంలో స్టూడెంట్స్, పిల్లల భవిష్యత్‌పై ఆందోళనలో పేరెంట్స్ ఉన్నారు.
వలస కార్మికులు, కూలీల పిల్లలపై ఎఫెక్ట్
సిటీలోని గవర్నమెంట్ స్కూల్స్‌లో 20 నుంచి 30శాతం వరకు వలస కార్మికులు, కూలీల పిల్లలే చదువుతున్నారు. కరోనా కారణంగా పనుల్లేక బతకడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఎలా కొనగలమని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ లెక్కల ప్రకారం సిటీలోని గవర్నమెంట్స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్స్ లో 36,950వేల మందికి ఫోన్ యాక్సెస్ ఉంది. 17వేల మంది ఇళ్లల్లో డీటీహెచ్, 38,200 మంది ఇళ్లల్లో కేబుల్ టీవీలున్నాయి. స్మార్ట్ ఫోన్, నెట్ కనెక్షన్ ఉన్న వారి సంఖ్య 29,800. ఎలాంటి యాక్సెస్ కూడా లేని స్టూడెంట్స్10,600 మంది ఉన్నారు. ఇప్పుడు వారందరూ టీవీ పాఠాలు వినలేని పరిస్థితి ఉంది.
వర్క్షీట్లకే సరిపోతోందంటున్న టీచర్లు
టీవీలు, ఫోన్లు అందుబాటులో లేని స్టూడెంట్స్‌ని హెడ్ మాస్టర్స్, టీచర్స్ దత్తత తీసుకుని వారు క్లాసులు వినేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోతోంది. వర్క్ షీట్స్, ప్రిపరేషన్ కే టైమ్ సరిపోతోందని టీచర్లు చెప్తున్నారు. “మా స్కూల్ లో 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 60శాతం మందే మొదటి రోజు క్లాసులు విన్నారు. ఒక్కో సెక్షన్ లో 30 మంది ఉంటే సగం మందికి స్మార్ట్ ఫోన్స్ లేవు. టీవీలు ఉన్నవాళ్లూ కన్ఫూజ్ అయ్యారు” అని ఖైరతాబాద్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ తెలిపారు. స్మార్ట్ ఫోన్స్ ఉన్నా 10శాతం మంది స్టూడెంట్స్ నెట్ వర్క్ ఇష్యూస్ ఎదుర్కొన్నట్లు చెప్పారు.
టీవీ లేక ఇబ్బందులు
నేను, మా ఆయన రోజూ కూలీకి పోతే తప్ప ఇల్లు గడవది. మా దగ్గర చిన్న ఫోన్లే ఉన్నయి. ఇంట్లో టీవీ లేదు. అంతకుముందు పక్కింటికి వెళ్లి చూసేటోల్లం. ఇప్పుడు కరోనా భయంతో రానిస్తలేరు. మా బిడ్డ ఏడో తరగతి చదువుతాంది. టీవీ లేక పాఠాలు వినలేకపోతున్నానని ఏడుస్తోంది. ఏం చేయాల్నో అర్థం కాట్లేదు.
‑ భవాని, పేరెంట్, ఫిలింనగర్
కమ్యూనిటీ హాల్లో టీవీ ఏర్పాటుకు ప్రయత్నం
మా స్కూల్ లో చదివే 10శాతం మంది పిల్లల ఇంట్లో స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. కానీ, అవి పనులకు పోయే పెద్దవాళ్ల దగ్గర ఉంటున్నాయి. యాక్సెస్ ఏదీ లేని పిల్లల కోసం స్కూల్ కి దగ్గర్లోని కమ్యూనిటీ హాల్ లో టీవీ ఏర్పాటుచేసేలా కార్పొరేటర్, లోకల్ లీడర్లతో మాట్లాడుతున్నాం. అప్పటి వరకూ పిల్లలను బ్యాచ్‌లు చేసి స్కూల్‌కే రమ్మని చెప్తున్నం. వర్క్ షీట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వాలనుకుంటున్నాం.
‑ విజయలక్ష్మీ, హెచ్ఎం, ఫిలింనగర్ గవర్నమెంట్ స్కూల్