
ఇటలీలో షాకింగ్ ఘటన..ఉత్తర ఇటలీలోని మిలన్ బెర్గామో ఎయిర్ పోర్టులో మంగళవారం(జూలై8) ఉదయం ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్ కోసం సిద్ధమవుతున్న విమానం ఇంజిన్‌లోకి ఓ వ్యక్తి దూసుకు పోయి మృతిచెందాడు. ఈ సంఘటన స్థానికంగా,అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది.
మంగళవారం ఉదయం 10:20 గంటల ప్రాంతంలో మిలన్ బెర్గామో విమానాశ్రయ ట్యాక్సీవే (taxiway) దగ్గర ఈ ఘటన జరిగింది. అస్టూరియాస్ (Asturias) నుంచి స్పెయిన్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వొలోటియా (Volotea) ఎయిర్‌బస్ A319 విమానం పార్కింగ్ ప్రాంతం నుంచి బయలుదేరి టేకాఫ్ కోసం కదులుతుండగా ఒక వ్యక్తి ఆ విమానం ఇంజిన్ వైపు పరిగెత్తడంతో అందులోకి లాగబడ్డారు. మృతిచెందిన వ్యక్తి ప్రయాణికుడు కాదు, ఎయిర్ పోర్టు ఉద్యోగి కాదనీ.. ఎవరో అగంతుకుడి అయి ఉంటాడని అధికారులు చెబుతున్నారు.
ALSO READ | నైజీరియాలో ఘోర ప్రమాదం.. 21 మంది దుర్మరణం
స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం..ఆ వ్యక్తి ఎయిర్ పోర్టులోకి అక్రమంగా ప్రవేశించారని తెలుస్తోంది. అతను టెర్మినల్ సమీపంలో తన కారును వదిలివేసి అక్రమ మార్గంలో ప్రవేశించి ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లోని అరైవల్స్ ఏరియాకు చేరుకున్నారు. అక్కడి నుంచి అతను నేరుగా విమానాల పార్కింగ్ ప్రాంతాలకు దారి తీసే ఒక సెక్యూరిటీ డోర్‌ను తెరిచి రన్‌వేపైకి వచ్చాడని తెలుస్తోంది. కొందరు ప్రత్యక్ష సాక్షులు అతను రన్‌వేపై పరిగెత్తుతుండగా పోలీసులు అతన్ని వెంబడించారని తెలిపారు కానీ ఆపలేకపోయారని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో విమానాశ్రయ కార్యకలాపాలు రెండు గంటల పాటు నిలిపివేశారు. ఉదయం 10:20 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విమానాలను నిలిపివేసినట్లు విమానాశ్రయ ఆపరేటర్ SACBO ప్రకటించింది. దీంతో 19 విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు.ఈ సంఘటనపై దర్యాప్తును ఇటాలియన్ అధికారులు ప్రారంభించారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు ,భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన మిలన్ బెర్గామో విమానాశ్రయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భద్రతా ప్రోటోకాల్స్‌పై ఆందోళనలను పెంచింది. ఎయిర్ పోర్టు్లో ఎంత కట్టుదిట్టమైన భద్రతను కలిగి ఉన్నప్పటికీ ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ఎలా జరుగుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.