
కాబూల్.. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని..మోడరన్ సిటీ..ఇప్పుడు అత్యంత భయంకరరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అదే నీటి కొరత..గత కొన్నేళ్లుగా అడుగంటిన భూగర్భజలాలు, రోజురోజుకు దిగజారుతున్న వాతావరణ పరిస్థితులు..ఈ ధోరణి ఇలా కొనసాగితే 60లక్షల ప్రజలున్న కాబూల్ నగరం..రాబోయే ఐదేళ్లలో కాబూల్ ప్రపంచంలోనే నీరులేక ఎడారిగా మారనుంది. నీరులేక అల్లాడే తొలి ఆధునిక నగరంగా మారే ప్రమాదం ఉంది. వివరాల్లోకి వెళితే..
అంతర్జాతీయ సహాయ సంస్థ మెర్సీ కార్ప్స్ కొత్త నివేదిక ప్రకారం.. కాబూల్ ప్రపంచంలోనే నీటి కొరత ఉన్న మొట్టమొదటి ఆధునిక నగరంగా మారే సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాదాపు ఆరు మిలియన్ల మందికి నివాసంగా ఉన్న ఆఫ్ఘన్ రాజధానిలో అత్యవసర చర్యలు తీసుకోకపోతే 2030 నాటికి దాని జలాశయాలు ఎండిపోయే ప్రమాదం ఉంది.
ఈ భయంకరమైన హెచ్చరిక కేవలం సైద్ధాంతికం మాత్రమే కాదు.. కొన్నేళ్లుగా తగ్గుతున్న భూగర్భ జల మట్టాలు, పెరుగుతున్న డిమాండ్ ,దిగజారుతున్న వాతావరణ పరిస్థితులు ఈ పరిస్థితికి కారణం అవుతున్నాయి. ఈ నీటి సంక్షోభం ఇలాగే కొనసాగితే మూడు మిలియన్ల మంది నివాసితులు తిండి, నీరు లేక మలమలమాడే పరిస్థితి వస్తుందని, ఆధునిక కాలంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మానవ పతనానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.
కాబూల్‌లో నీరు ఎందుకు అయిపోతోంది?
వాతావరణ మార్పు, దశాబ్దాల యుద్ధం, వేగవంతమైన జనాభా పెరుగుదల,పాలనా వైఫల్యాల వంటి పరిస్థితులతో కాబూల్ లో ఈ సంక్షోభం తలెత్తింది. గత దశాబ్దంలో భూగర్భజల మట్టాలు 30 మీటర్ల వరకు పడిపోయాయని మెర్సీ కార్ప్స్ నివేదిక చెబుతోంది. కాబూల్ నగరానికి ప్రధాన తాగునీటి వనరు అయిన కాబూల్‌లోని దాదాపు సగం బోర్‌హోల్స్ ఇప్పటికే ఎండిపోయాయి.
నివాసితులు నీరు లేక ఇప్పటికే అనేక అవస్థలు పడుతున్నారు. చాలామంది ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు, వారి ఆదాయంలో 30శాతం వరకు నీటికోసమే ఖర్చు చేస్తున్నారు. మెర్సీ కార్ప్స్ ప్రకారం.. కాబూల్ జనాభాలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది నీటి సంబంధిత అప్పుల్లో ఉన్నారు.
కాబూల్ నీటి సంక్షోభానికి కారణాలు
అధిక జనాభా పెరుగుదల ,పట్టణీకరణ.. ఒక కారణంగా చెప్పొచ్చు. 2001లో కేవలం 10లక్షల మంది ఉన్న కాబూల్ జనాభా ఇప్పుడు 6-7 లక్షలకు చేరుకుంది. ఈ భారీ జనాభా పెరుగుదల నగర నీటి సరఫరా వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడిని తెచ్చింది.
భూగర్భజలాల విపరీత వినియోగం.. కాబూల్ ప్రధానంగా భూగర్భజలాలపై ఆధారపడుతుంది. గత దశాబ్దంలో భూగర్భజలాల స్థాయిలు 25నుంచి -30 మీటర్లు (82నుంచి -98 అడుగులు) పడిపోయాయి. ప్రతి యేటా భూగర్భజలాలు సహజంగా పునరుత్పత్తి అయ్యే దానికంటే 44 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. నగరంలోని సుమారు 120,000 పైగా అక్రమ బోర్‌వెల్స్, వందలాది కర్మాగారాలు, గ్రీన్‌హౌస్‌లు ఈ భూగర్భజలాలను విపరీతంగా తోడేస్తున్నాయి.
శీతోష్ణస్థితి మార్పు: ఆఫ్ఘనిస్తాన్ శీతోష్ణస్థితి మార్పుల ప్రభావానికి గురవుతున్న ఆరో అత్యంత బలహీనమైన దేశం. హిందూకుష్ పర్వతాల నుంచి వచ్చే మంచు ,హిమానీనదాల కరిగి కాబూల్ నది, దాని ఉపనదులకు నీరందిస్తున్నాయి. అయితే తగ్గిన మంచు,తక్కువ వింటర్ నీటి లభ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
నీటి కాలుష్యం: కాబూల్‌లోని భూగర్భజలాల్లో 80శాతం వరకు మురుగునీరు, విష పదార్థాలు, అధిక స్థాయి ఆర్సెనిక్ ,లవణాలతో కలుషితమై ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది.
బోర్‌వెల్స్ ఎండిపోవడం: UNICEF అంచనాల ప్రకారం..కాబూల్‌లోని భూగర్భ బోర్‌వెల్స్‌లో దాదాపు సగం ఇప్పటికే ఎండిపోయాయి. ఇవి చాలా మంది నివాసితులకు ప్రాథమిక తాగునీటి వనరులు అందడం లేదు.
నీటి కొరత సంక్షోభం కొనసాగితే..
ప్రస్తుత ధోరణి కొనసాగితే 2030 నాటికి కాబూల్ భూగర్భజల వనరులు పూర్తిగా ఎండిపోనున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. ఇది దాదాపు 30లక్షల మంది ఆఫ్ఘన్ ప్రజలను ప్రాంతం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇది మానవతా ,వలస సంక్షోభాన్ని సృష్టిస్తుంది.
ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేకుండా పోతుంది. ఎందుకంటే సంపన్న నివాసితులు లోతైన బోర్‌వెల్‌లను తవ్వగలుగుతారు.ఇది పేదల నీటి లభ్యతను మరింత పరిమితం చేస్తుంది.
పరిష్కారం ఉందా?..
నియంత్రణ చర్యలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నీటి సంరక్షణ పద్ధతులు ,ప్రత్యామ్నాయ నీటి వనరుల అభివృద్ధి వంటివి సమగ్ర నీటి వనరుల నిర్వహణ పద్దతులను అమలు చేయడం ద్వారా భూగర్భజలాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు సాయపడొచ్చంటున్నారు నిపుణులు. నీటి సంరక్షణ ,సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతుల ద్వారా నీటిని పొదుపుగా వాడటం ,ఆధునిక నీటిపారుదల పద్ధతులను అవలంబించడం చాలా ముఖ్యమంటున్నారు. వర్షపు నీటిని సేకరించి భూగర్భజలాలను తిరిగి నింపే కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందంటున్నారు.
కాబూల్ నీటి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అంతర్జాతీయ సమాజం నుంచి తక్షణ, సమన్వయ జోక్యం, నిధులు అవసరం అని నిపుణులు చెబుతున్నారు. నీటి వనరుల సమర్థవంతమైన నిర్వహణకు పటిష్టమైన పాలన ,నియంత్రణ చట్టాలు అవసరమంటున్నారు. పంచశీర్ నది పైప్‌లైన్, షా తూత్ ఆనకట్ట వంటి దీర్ఘకాలికంగా ప్రణాళిక చేయబడిన ప్రాజెక్టులను పూర్తి చేయడం అవసరం ఉందంటున్నారు.
కాబూల్ ఎదుర్కొంటున్న ఈ నీటి సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా నగరాలు ఎదుర్కొనే సవాళ్లకు ఒక సూచనగా చెప్పొచ్చు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోకపోతే అది తీవ్రమై మానవతా విపత్తుకు దారితీస్తుందని నిపుణులు, రిపోర్టులు చెబుతున్నాయి.