ఫిలిప్పీన్స్ దేశంలో తుఫాన్ బీభత్సంతో అల్లాడిపోతుంది. 2025లోనే.. అంటే ఈ 10 నెలల్లోనే 20 తుఫాన్లు ఫిలిప్పీన్స్ దేశాన్ని సర్వ నాశనం చేశాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన కల్మేగి తుఫాన్ విధ్వంసం అంచనాలకు అందని విధంగా ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. గుయిమారస్ ప్రావిన్స్లోని జోర్దాన్ పట్టణంలో160 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. ఈ పెను గాలులకు సిటీలోని వందల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. పైకప్పులు ఎగిరిపోయాయి. గాలులతోపాటు కుండపోత వర్షం.. సిటీని ముంచెత్తింది. వరదలు పోటెత్తటంతో 100 మంది వరకు చనిపోయారు. చాలా మంది ఆచూకీ గల్లంతు అయ్యింది.
జోర్దాన్ సిటీ, అగుసాన్ డెల్ సుర్ ప్రావిన్స్లో పడిన వర్షం.. వరదలకు వేలాది కార్లు కొట్టుకుపోయాయి. నీళ్లల్లో తేలుతూ కార్లు కొట్టుకుపోయాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోవటం.. ఇళ్లు కూలిపోవటంతో ఇళ్లల్లోని జనం రోడ్డున పడ్డ దయనీయ పరిస్థితులు ఉన్నాయి. వర్షం, గాలుల నుంచి తలదాచుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. అధికారికంగానే 66 మంది చనిపోయినట్లు ప్రకటించిన ప్రభుత్వం.. మరో 30 మంది ఆచూకీ లేదని.. వారి కోసం గాలిస్తున్నట్లు వివరించింది.
సహాయ చర్యల్లో భాగంగా ఐదుగురు సిబ్బందితో వచ్చిన ఆర్మీ హెలికాప్టర్ లోరెటో పట్టణం సమీపంలో కూలిపోయింది. వాతావరణం అనుకూలించకపోవటంతోనే ఇలా జరిగిందని ఆర్మీ ప్రకటించింది. ఈ క్రమంలోనే సహాయ చర్యలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఫిలిప్పీన్స్ దేశంలో ఈ ఏడాదిలోనే.. 2025లోనే ఇప్పటి వరకు 20 తుఫాన్లు వచ్చాయి. ఆల్ మోస్ట్ ఆ దేశంలోని ప్రతి ఒక్కరూ ఏదో విధంగా తుఫాన్ బాధితులే కావటం శోచనీయం.
