
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తయ్యింది. గ్రేటర్ పరిధి జిల్లాల రెవెన్యూ అధికారులకు రికార్డులను త్వరలో పంపనున్నారు. అయితే వెరిఫికేషన్‌లో దరఖాస్తుదారులు దొరకడం లేదంటూ 40 శాతం అప్లికేషన్లను బల్దియా అధికారులు పక్కన పెట్టారు. గ్రేటర్ పరిధిలో వచ్చిన 7 లక్షల10 వేల దరఖాస్తుల్లో దాదాపు 3 లక్షల దరఖాస్తుల వెరిఫికేషన్ జరగలేదు. మిగతా 4 లక్షలకు పైగా దరఖాస్తుదారుల ఓటర్ ఐడీ కార్డు, కమ్యూనిటీ వివరాలను యాప్‌లో పొందుపర్చారు.
ఇచ్చిన అడ్రస్ మారడంతో..
గ్రేటర్ పరిధిలో 111 ప్రాంతాల్లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది. ఇందులో 49 స్లమ్ ఏరియాల్లో 9,828 ఇండ్లు, 68 ఖాళీ స్థలాల్లో 90,172 ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు 23 ప్రాంతాల్లో 4 వేలకుపైగా ఇండ్లను లబ్ధిదారులకు అందించారు. కాగా 2017 నుంచి 2019 వరకు దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లకు బల్దియా సిబ్బంది వెళ్లగా దరఖాస్తుదారులు అందుబాటులో లేరు. అప్లయ్ చేసుకున్న సమయంలో అద్దెకున్న అడ్రెసులు పెట్టి ఇప్పుడు అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. దరఖాస్తులో ఉన్న ఫోన్ నంబర్లు కలవడం లేదు. దీంతో ఆ దరఖాస్తులను జీహెచ్ఎంసీ అధికారులు పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఇలాంటి అప్లికేషన్లు మూడు లక్షలకు పైగా ఉన్నాయి. అప్లయ్ చేసిన వారి నుంచి ఓటర్ ఐడీతో పాటు తదితర వివరాలు సేకరించారు. అయితే, అందుబాటులో లేనివారి వివరాలను బల్దియా నేటికీ సేకరించలేకపోయింది. దరఖాస్తు చేసుకొని వెరిఫికేషన్ కాని వారికి వేరే విధంగా ఏదైనా అవకాశం కల్పిస్తారా? లేదా? అనే విషయంపై అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు.
15 శాతం మందికి మాత్రమే ఇండ్లు
డబుల్ ఇండ్ల వెరిఫికేషన్ పూర్తయినట్లే కనిపిస్తోంది. వెరిఫికేషన్ చేసిన ఫైల్స్‌ను తొందరలోనే రెవెన్యూ అధికారులకు పంపనున్నారు. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు అర్హులైన లబ్ధిదారులను గుర్తించే పనిలో పడనున్నారు. 4 లక్షలకుపైగా దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తికాగా.. ఇందులో కేవలం 15 శాతం మందికి మాత్రమే ఇండ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది. లబ్ధిదారుల గుర్తింపు సైతం సవాల్‌గా మారింది. ఒకరికి ఇండ్లు వచ్చి మరొకరికి రాకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత రానుంది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మాన్యువల్‌గా వచ్చిన దరఖాస్తులు కానొస్తలే..
డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం కలెక్టర్ ఆఫీసులతో పాటు జీహెచ్ఎంసీ ఆఫీసులోనూ మొదట మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరించారు. అయితే దరఖాస్తులు ఎక్కువగా వస్తుండటంతో మీసేవ కేంద్రాల ద్వారా అప్లయ్ చేసుకోవాలని అప్పట్లో అధికారులు సూచించారు. అయితే అంతకుముందు లక్షకు పైగా దరఖాస్తులు మాన్యువల్‌గా వచ్చాయి. కానీ, జీహెచ్ఎంసీ నిర్వహించిన వెరిఫికేషన్‌లో మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన అప్లికేషన్లు మాత్రమే ఉన్నాయి. మాన్యువల్‌గా తీసుకున్న దరఖాస్తులు లేవు. దీంతో వారికి ఇండ్లు లభించే అవకాశం లేదని అధికారులు సైతం చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. తమ వివరాలు సేకరించేందుకు ఎవరూ రావడం లేదని కొంతమంది దరఖాస్తుదారులు జీహెచ్ఎంసీ హెడ్డాఫీసుతో పాటు జోనల్, డిప్యూటీ కమిషనర్ల ఆఫీసులతో పాటు కలెక్టరేట్, తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.