ACB News: ప్రభుత్వ అధికారులు దొరక్కుండా లంచాలు తీసుకోవాటనికి అనేక వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోనూ ఓ లంచాధికారి వ్యవహారం బయటపడింది. రాజస్థాన్ హైకోర్టులో ఒక వ్యక్తి ఫైల్ చేసిన పిటిషన్ వల్ల మెుత్తం విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రద్యుమ్న్ దీక్షిత్ రాజస్థాన్ ఐటీ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి టెండర్లు పొందిన రెండు కంపెనీల నుంచి లంచాలు తీసుకునేందుకు ఏకంగా ఆ సంస్థల్లో తన భార్య పూనమ్ దీక్షిత్ ను అక్కడి ఉద్యోగిగా మార్చేశాడు. అయితే గడచిన రెండేళ్లలో ఆమె ఒక్కరోజు కూడా ఆఫీసుకు వెళ్లకుండానే జీతంగా రూ.37లక్షల 54వేలు సదరు సంస్థల నుంచి అందుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఓరియన్ ప్రో, ట్రీగన్ సాఫ్ట్ వేర్ లిమిటెడ్ కంపెనీలో పూనమ్ ఒక బూటకపు ఉద్యోగి అని ఆమె ఆఫీసు ముఖం కూడా ఎప్పుడూ చూడకుండానే జీతం రూపంలో భర్త లంచాలను అందుకున్నట్లు తేలింది.
రాజస్థాన్ కోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది సెప్టెంబరులో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు చేపట్టిన దర్యాప్తులో మెుత్తం వ్యవహారం బయటపడింది. ప్రైవేటు కంపెనీలకు టెండర్లు పొందేలా చేసినందుకు లంచాన్ని నేరుగా కాకుండా తన భార్యను ఉద్యోగిగా చేర్చుకుని వేతనం రూపంలో అధికారి పొందినట్లు తేల్చింది ఏసీబీ. 2019 జనవరి నుంచి 2020 సెప్టెంబర్ మధ్య కాలంలో పూనమ్ కు చెందిన 5 వేరువేరు బ్యాంక్ ఖాతాలకు శాలరీ పేరుమీద డబ్బు జమ అయినట్లు గుర్తించబడింది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అస్సలు ఒక్కరోజు కూడా పూనమ్ ఆ కంపెనీల ఆఫీసులకు వెళ్లనప్పటికీ ఆమె హాజరుకు సంబంధించిన అప్రూవల్స్ ప్రద్యుమ్న్ దీక్షిత్ ఇచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఏకకాలంలో రెండు సంస్థల నుంచి జీతాన్ని ఫ్రీలాన్సింగ్ పేరుతో పూనమ్ దీక్షిత్ పొందినట్లు తేల్చారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఆమె పనిచేసిన సమయంలోనే రెండు ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ టెండర్లు దక్కినట్లు వెల్లడైంది. చేసిన పాపం ఎప్పటికైనా బయటపడటం తప్పదు అని ఈ కేసు నిరూపిస్తోంది.
