హరీష్ రావు తండ్రి మృతికి MLC కవిత సంతాపం

హరీష్ రావు తండ్రి మృతికి MLC కవిత సంతాపం

హైదరాబాద్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె ట్వీట్ చేశారు. ‘‘మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని కవిత పేర్కొన్నారు. 

గత కొంతకాలంగా హరీష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. హరీష్ రావు అవినీతి అనకొండ అని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. మా ఫ్యామిలీలో హరీష్ రావు చిచ్చులు పెడుతున్నాడని కూడా ఆమె ఆరోపణలు చేశారు. హరీష్ రావుపై చేసిన ఆరోపణలకుగానూ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కేసీఆర్.

 దీంతో కవిత హరీష్ రావుపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో హరీష్ రావు తండ్రి మరణం పట్ల ఆమె సంతాపం వ్యక్తం చేయడం చర్చనీయాశంగా మారింది. హరీష్ రావు తండ్రి మరణం పట్ల ఎక్స్ వేదికగా సంతాపం తెలిపిన కవిత.. విభేదాల కారణంగా హరీష్ రావు ఇంటికి వెళ్తుందా లేదా అనేది హాట్ టాపిక్‎గా మారింది. 

గతకొంత కాలంగా అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు మంగళవారం (అక్టోబర్ 28) తెల్లవారుజూమున తుది శ్వాస విడిచారు. బంధువులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్‎లోని హరీష్ రావు నివాసం క్రిన్స్ విల్లాస్‎లో ఉంచారు. మంగళవారం (అక్టోబర్ 28) మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.