- అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్
నల్గొండ, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. సోమవారం కలెక్టర్ఆఫీసులో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఎంతో దూరం నుంచి సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుదారులు నల్గొండ జిల్లా కేంద్రానికి వస్తారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
సోమవారం మొత్తం 98 ఫిర్యాదులు రాగా జిల్లా అధికారులకు 53, రెవెన్యూ శాఖకు 45 ఫిర్యాదులు వచ్చాయన్నారు. గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, దేవరకొండ, చండూరు ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేట: రాబోయే రెండు రోజులు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని అడిషనల్కలెక్టర్ సీతారామారావు నిర్వాహకులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును రిజిస్టర్ నమోదు చేయాలని సూచించారు.
వారం రోజుల్లో పరిష్కరించాలని లేదంటే కారణాలు అర్జీదారులకు తెలియజేయాలని సూచించారు. భూ సమస్యలకు సంబంధించి 9 దరఖాస్తులు, ఎంపీడీవోలకు 5 దరఖాస్తులు, జిల్లా పంచాయతీ అధికారికి 4 దరఖాస్తులు,ఇతర శాఖలకు చెందిన 18 మొత్తం 36 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
