సూర్యాపేట, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి, వచ్చే సంవత్సరం జరగనున్న పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలని ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రెటరీ భీమ్ సింగ్ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సూర్యాపేట జిల్లాలోని ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఎఫ్ఆర్ ఎస్ వందశాతం అమలు చేయాలన్నారు.
అలాగే 90 రోజుల ప్రోగ్రాంను నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతీ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 5 డిజిటల్ బోర్డులను మంజూరు చేసిందన్నారు. ప్రతీరోజు స్టడీ అవర్స్ నిర్వహించి, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. డీఐఈవో భానునాయక్ తదితరులున్నారు.
