ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో అంతర్గత రోడ్ల కోసం ప్రభుత్వం పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖకు నిధులు మంజూరు చేసింది. సుమారు 965 సీసీ రోడ్డు పనులు చేపడుతుండగా, 58 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మినహా ములుగు, మల్లంపల్లి, వెంకటాపూర్, గోవిందరావుపేట, ఎస్‌ఎస్‌తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో మొత్తం 965 సీసీ రోడ్డు పనులు చేపట్టనున్నారు. అందుకు మొత్తం 77.113 కిలోమీటర్లకు రూ.46.85 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రోడ్లు, భవనాల శాఖ ద్వారా చేపట్టనున్న జిల్లాలోని రెండు ప్రధాన రహదారులకు రూ.71కోట్లు నిధులు మంజూరు చేశారు.
ములుగు మండలం జంగాలపల్లి నుంచి వెంకటాపూర్, పాలంపేట మీదుగా భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ క్రాస్ వదరకు 24.03 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు రూ.29.96 కోట్లు, ఏటూరునాగారం నుంచి రామన్నగూడెం, కమలాపూర్, మంగపేట, మల్లూరు, చెంచుపల్లి, రమణక్కపేట, రాజుపేట వరకు 34.69 కిలోమీటర్లకు రూ.41.54 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రోడ్లకు టెండర్ ప్రక్రియ పూర్తిచేసి పనులు మొదలు పెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
నిధుల మంజూరుపై హర్షం
వెంకటాపూర్/ గోవిందరావుపేట: రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో గోవిందరావుపేట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఇందిరమ్మ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు వెంకటకృష్ణ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
