400 సీట్లు దాటుతం : ప్రధాని నరేంద్ర మోదీ

400 సీట్లు దాటుతం : ప్రధాని నరేంద్ర మోదీ
  • మాతో పోరాడలేక ఇండియా కూటమి చేతులెత్తేసింది 
  • ప్రతిపక్ష పార్టీల సొంత క్యాడర్ కూడా వాళ్లకు ఓటేస్తలేదు  
  • అదానీ, అంబానీపై అధిర్ రంజన్ చేసిన కామెంట్లనే ప్రస్తావించిన 
  • పీటీఐ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి

భువనేశ్వర్: ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కచ్చితంగా 400 సీట్లు దాటుతామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ బీజేపీ సర్కారే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. దక్షిణాదిలోనూ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని తెలిపారు. దక్షిణాదిలో బీజేపీ ఉనికి లేదని ప్రతిపక్ష నేతలు ఒక అభూత కల్పన సృష్టించారని మండిపడ్డారు. ‘‘బీజేపీ దళిత, ఓబీసీ వ్యతిరేక పార్టీ, బ్రాహ్మణ అనుకూల పార్టీ అని దక్షిణాదిలో ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి మా పార్టీ నుంచే ఎక్కువ మంది దళితులు, ఓబీసీలు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఎప్పటికైనా నేషన్ ఫస్ట్ అనేదే మా సిద్ధాంతం. గత ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చిన సీట్ల కన్నా ఈసారి ఎక్కువ వస్తాయి. అలాగే మా  పార్టీకి ఓట్ల శాతం కూడా పెరుగుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పీటీఐ వార్తా సంస్థకు మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ‘‘దేశంలో అవినీతి చాలా సీరియస్ ఇష్యూ. దీన్ని రూపుమాపేందుకు కేంద్ర దర్యాఫ్తు సంస్థలు చురుగ్గా పని చేస్తున్నాయి.

మా ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశాయి. వాటి పని అవి స్వేచ్ఛగా చేసుకోనివ్వాలి తప్ప మధ్యలో తలదూర్చొద్దనేది మా ప్రభుత్వ విధానం’’ అని చెప్పారు. అంబానీ, అదానీ విషయంలో ఇటీవల చేసిన కామెంట్లపై స్పందిస్తూ.. ‘‘కొంతకాలంగా అదానీ, అంబానీలను ప్రస్తావిస్తూ రాహుల్ సహా కాంగ్రెస్ నేతలందరూ బీజేపీపై ఆరోపణలు చేశారు.

కానీ లోక్ సభ ఎన్నికల వేళ సడెన్ గా వారి పేర్లే ఎత్తడం లేదు. దీంతో ఆ వ్యాపారవేత్తలు ట్రక్కుల నిండా డబ్బులు పంపించారా? అని నేను ప్రశ్నించాను. ఇవి నా మాటలు కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధరి గతంలో చేసిన వ్యాఖ్యలనే నేను ప్రస్తావించాను” అని మోదీ పేర్కొన్నారు. ఇక పదేండ్ల అభివృద్ధి పాలనను ఎలా ఎదుర్కోవాలో తెలియక, బీజేపీని విమర్శించేందుకు ఏ అవకాశమూ లేక ప్రతిపక్ష కూటమి ఇప్పటికే చేతులెత్తేసిందని మోదీ అన్నారు. ‘‘ఓటమి ఖాయమని అర్థమైపోవడంతో ప్రతిపక్ష కూటమిలోని పార్టీల నేతలు చాలామంది రోడ్డెక్కడం లేదు. దీంతో ఆ పార్టీల సొంత క్యాడర్ కూడా వాళ్ల పార్టీలకు ఓటేయడానికి వెళ్లడం లేదు” అని అన్నారు. 

రాజ్యాంగం వల్లే ఇక్కడి దాకా వచ్చా..

మోదీని తయారు చేసింది రాజ్యాంగమేనని, రాజ్యాంగం లేకుంటే మోదీ లేడని ప్రధాని అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ 400 సీట్లు అడుగుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితం. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి కూడా 400 సీట్లకు పైనే ఉన్నాయి. కేబినెట్ లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు స్థానం కల్పించింది బీజేపీనే. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగ నిర్మాతలు భావించలేదు. కాంగ్రెస్ మాత్రం రాజ్యాంగాన్ని అవమానిస్తూ అనేక రాష్ట్రాల్లో మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించింది” అని చెప్పారు.  

కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇచ్చి తీరుతం..

జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని కచ్చితంగా నెరవేరుస్తామని మోదీ తెలిపారు. ‘‘ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. దాదాపు 70 ఏండ్ల పాటు కాశ్మీరీలను కొన్ని పార్టీలు అభివృద్ధికి దూరం ఉంచాయి. గడిచిన ఐదేండ్లలో మేం చేసిన కృషితో కాశ్మీర్ కు అద్భుత భవిష్యత్తు ఏర్పడనుంది.

ఇతర రాష్ట్రాలలాగే కాశ్మీర్ కూడా అభివృద్ధి చెందుతుంది” అని తెలిపారు.  మైనారిటీలకు వ్యతిరేకంగా తానెప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని మోదీ చెప్పారు. బీజేపీ కూడా ఇప్పటిదాకా వారికి వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. ‘‘ దేశ ప్రజలందరినీ సమానంగా చూస్తాం. రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తిని కాంగ్రెస్ ఉల్లంఘిస్తోంది. మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది” అని మోదీ అన్నారు. 

ప్రజా విశ్వాసంతోనే బ్రాండ్ మోదీ’  గుర్తింపు 

2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, దానికోసం ఎంతకష్టమైనా వెనుకాడనని మోదీ అన్నారు. ‘‘నేను కార్యసాధకుడిని మాత్రమే. ఎవరు ఎక్కడ ఉండాలో, ఏమవ్వాలో నిర్ణయించేది దేశ ప్రజలే. ‘బ్రాండ్ మోదీ’ అనే పేరు సాధించేందుకు ప్రత్యేకంగా నేనేం చేయలేదు. రెండు దశాబ్దాలకు పైగా ప్రజల్లో నేను చూరగొన్న విశ్వాస ఫలితమే ఆ పేరు.

వారి జీవితాలను బాగుచేసేందుకు నేను చేస్తున్న నిస్వార్థ సేవ, నిరంతర ప్రయత్నాలు వారు ప్రత్యక్షంగా చూస్తున్నారు. నేనూ మనిషినే. తప్పులు జరుగుతుంటాయి. కానీ, ఇప్పటివరకు చెడు ఉద్దేశంతో ఏదీ చేయలేదు. ప్రజల ఆశీర్వాదమే నన్ను ముందుకు నడిపిస్తున్నది. నా ప్రసంగాలు వినేందుకు ఎండలోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నారు.