Sri Rama Navami : 400 ఏండ్ల నాటి సీతారామచంద్రస్వామి ఆలయం

Sri Rama Navami : 400 ఏండ్ల నాటి సీతారామచంద్రస్వామి ఆలయం

మెదక్​ జిల్లా రామాయంపేట మండలంలోని రాయిలాపూర్‌‌‌‌‌‌‌‌లో ఎంతో పురాతనమైన సీతారామచంద్రస్వామి దేవాలయం ఉంది. సుమారు 400 ఏళ్ల క్రితం ఈ గుడి నిర్మాణం గ్రామం మధ్యలో జరిగినట్టు చెప్తారు. ఈ ఆలయం కొంత వరకు శిథిలం కాగా.. 2003లో పునర్నిర్మాణం చేశారు. అప్పటినుంచి ఇక్కడ ఏటా శ్రీరామనవమి మొదలుకొని పౌర్ణమి వరకు ఏడు రోజుల పాటు నిత్యం సాయంత్రం సేవా  కార్యక్రమాలు  చేస్తున్నారు.

మొదటి ఐదు రోజులు గ్రామంలో ఊరేగింపు చేస్తారు. 5వ రోజు జరిగే పొన్నసేవ, 6వ రోజు మధ్యాహ్నం జరిగే గరుడ సేవా కార్యక్రమాలు చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున వస్తారు. పౌర్ణమి రోజు తెల్లవారు జామున గ్రామంలో రథోత్సవం  ఉంటుంది.

ఇదే మండలంలోని డి.ధర్మారంలో ప్రతి శ్రీరామ నవమికి రఘుపతి గుట్ట జాతర ఘనంగా జరుగుతుంది. రెండు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు చేస్తారు. నవమి రోజు రాములోరి కల్యాణం, మరుసటి రోజు జాతర, ఎడ్ల బండ్ల ఊరేగింపు చేస్తారు.

మండలంలోని దాదాపు అన్ని గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. గుట్టపై ఉన్న గుడిని ఈ ఏడాది పునర్నిర్మించారు. ఈ నెల 13 నుంచి ప్రతిష్ఠోత్సవాలతోపాటు, స్వామి కల్యాణం చేస్తామని ఆలయ కమిటీ తెలిపింది. 

రామాయంపేట, వెలుగు