4 వేల ఇండ్ల కూల్చివేతపై రేపు సుప్రీం విచారణ

4 వేల ఇండ్ల కూల్చివేతపై రేపు  సుప్రీం విచారణ

హల్ద్వానీ/న్యూ ఢిల్లీ: ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో రైల్వే భూమిలో నిర్మించిన 4 వేల ఇండ్లు, స్కూళ్లు, ప్రార్థనా స్థలాలు కూల్చివేతకు   ఉత్తరాఖండ్ హైకోర్టు ఇటీవల తీర్చు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారించనుంది. ఈ ఘటనలో కూల్చివేతకు ముందుకు వెళ్లవద్దని ఇప్పటికే అధికారులను వేడుకోవడంతో పాటు, నిరసనలు కూడా చేస్తున్నారు. ఈ ఇళ్ళతో పాటు దాదాపు సగం కుటుంబాలు భూమిని లీజుకు తీసుకున్నట్లు సమాచారం. కాగా ఈ ప్రాంతంలో నాలుగు ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రైవేట్ పాఠశాలలు, ఒక బ్యాంకు, రెండు ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌లు, 10 మసీదులు, నాలుగు దేవాలయాలు, దుకాణాలు కొన్ని దశాబ్దాల క్రితమే నిర్మించినట్టు తెలుస్తోంది.

అయితే  డిసెంబర్ 20 నాటి కోర్టు ఆదేశాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం జనవరి 9లోగా రైల్వే స్థలంలో ఉన్న బంభుల్‌పురా, గఫూర్ బస్తీ, ధోలక్ బస్తీ, ఇందిరా నగర్ ప్రాంతాల్లోని ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇప్పటికే వార్తాపత్రికల్లో నోటీసు జారీ చేసింది. కాగా ఈ తొలగింపును ఆపాలని నివాసితులు క్యాండిల్ మార్చ్‌లు, ధర్నాలు చేశారు. స్థానిక మసీదులో వందలాది మంది 'ఇజ్తేమై దువా' అనే సామూహిక ప్రార్థన కూడా చేశారు. కాగా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎస్‌ఎ నజీర్, పీఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది.

ఇక హల్ద్వానీలో నివసించే వాళ్లలో చాలా మంది ముస్లింలే కావడంతో బీజేపీ ప్రభుత్వాన్ని నిందిస్తూ పలు పార్టీల కార్యకర్తలు, రాజకీయ నాయకులు కూడా ఈ నిరసనలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లోని తన ఇంట్లో గంటపాటు మౌనవ్రతం (మౌన ప్రతిజ్ఞ) నిర్వహించారు. "ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక రాష్ట్రం" అని ఆయన అన్నారు. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, మహిళలు సహా 50,000 మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయించి, రోడ్లపైకి  వచ్చేలా బలవంతం చేస్తే, అది చూడడానికే చాలా బాధాకరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.