4 వేల కిలోల మామిడి పండ్లు ధ్వంసం

4 వేల కిలోల మామిడి పండ్లు ధ్వంసం

తిరుచ్చి: నోరూరించే మధురమైన మామిడి పండ్లను తమిళనాడులో ధ్వంసం చేశారు. వివిధ సైజుల్లో కొన్ని పసుపు పచ్చ.. మరికొన్ని ఆకుపచ్చ రంగుల్లో వివిధ రకాల సైజుల్లో 4వేల కిలోల మామిడి పండ్లు ప్రమాదకరమైన ఇథలీన్ తో పండించినట్లు తనిఖీల్లో తేలడంతో కలకలం రేగింది. శనివారం స్థానిక గాంధీ మార్కెట్ లో ఆహార భద్రతా విభాగం (ఫుడ్ సేఫ్టీ అధికారులు) బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. మూడు గోడౌన్లలో రసాయనాలతో పండించిన 4 వేల కిలోల మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. కెమికల్ టెస్టులు చేయగా.. వాటిని ఇథలీన్ వంటి నిషేధిత మందులు ఉపయోగించి పండించినట్లు నిర్ధారణ అయినట్లు పంచనామా నిర్వహించిన అనంతరం ధ్వంసం చేశారు. 
మామిడి కాయలను తెచ్చి కృత్రిమ రసాయనాలతో కొన్ని గంటల్లో రంగు మారేటట్లు చేస్తున్నారు. వీటిని తోపుడు బండ్లపై చిరు వ్యాపారులు అమ్ముకునేందుకు వీలుగా రెండు మూడు రోజులపాటు యధా స్థితిలో ఉండేలా రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ విభాగం  అధికారులు  గుర్తించారు. మామిడి కాయలను పండించడానికి నిషేధిత ఇథలీన్ ను ఉపయోగిస్తున్నట్లు నిర్ధారణ అయింది. తమ తనిఖీల్లో మూడు గోడౌన్లలో 4 వేల కిలోల మామిడి కాయలు ఇథలీన్ తో పండించినట్లు గుర్తించామని ఫుడ్ సేఫ్టీ అధికారి ఆర్.రమేష్ బాబు తెలిపారు. నిబంధనల మేరకు  వెంటనే వాటని తీసుకెళ్లి ధ్వంసం చేశారు. ఫుడ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 ప్రకారం ఇథలీన్ ను ఉపయోగించి మామిడి కాయలను పండ్లు చేసిన మూడు గోడౌన్ల నిర్వాహకులు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.