మరో రెండ్రోజులు వానలు..షేక్ పేటలో నీట మునిగిన ఇళ్లు

మరో రెండ్రోజులు వానలు..షేక్ పేటలో నీట మునిగిన ఇళ్లు

హైదరాబాద్/జీడిమెట్ల, వెలుగు: గురువారం సాయంత్రం వరకు సూర్యుడు వస్తూ పోతూ ఉండగా, 5 గంటలకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. షేక్ పేట, గచ్చిబౌలి, బీహెచ్ఈఎల్, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, బేగంపేట తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. షేక్ పేటలో రెండు గంటల్లో 4.1 సెంటీమీటర్ల వాన పడింది. అలాగే గచ్చిబౌలిలో 3.7, బీహెచీఎల్​లో 2.7, కుత్బుల్లాపూర్​లో 2.2, బహదూర్ పురాలో1.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. షేక్ పేట పరిధి బాలాజీనగర్ పూర్తిగా నీట మునిగింది. ఇండ్లలోకి నీళ్లు రావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఐదేళ్లుగా వాన గట్టిగా కొట్టిన ప్రతిసారి ఇదే సమస్య ఉంటుందని, లీడర్లు, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. వరుస వానలపై గురువారం జోనల్ కమిషనర్లతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. అధికారులు అలర్ట్ గా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజలు కరెంటు పోల్స్ దగ్గర, చెట్ల కింద, నాలా పరిసర ప్రాంతాల్లో ఉండకుండా అప్రమత్తం చేయాలన్నారు. ఇబ్బందులు ఎదురైతే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040–-21111111,040-–29555500 నెంబర్లకు కాల్ చేయవచ్చన్నారు.