
అమ్మ చెంతకు కొడుకుది కన్నతల్లి కోసం ఆరాటం! ఒకటి కాదు, రెండు కాదు, 41 ఏళ్ల పాటు ఆమెకు దూరంగా ఉన్నాడు. కన్న తల్లి గురించి తెలిశాక ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అమ్మ జాడ దొరకలేదు. చివరకిప్పుడు తన కన్న తల్లిని చేరాడు. కడుపున పుట్టిన బిడ్డ అన్నేళ్ల తర్వాత వచ్చే సరికి, ఆ తల్లి ‘నా బిడ్డ.. నా బిడ్డ’ అంటూ అక్కున చేర్చుకుని మురిసిపోయింది. ఇది డేవిడ్ కిల్డెండల్ నీల్సన్ అనే డెన్మార్క్‌కు చెందిన వ్యక్తి కథ. ఆ కథేంటి, ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే 1976లలోకి వెళ్లిపోవాలి.
రెండేళ్లప్పుడే దత్తత.. అమ్మకు తెలియదు
అది తమిళనాడులోని వాషర్మాన్ పేట. ధనలక్ష్మి (68), కలియమూర్తి దంపతులకు 1976 ఆగస్టు 3న డేవిడ్ పుట్టాడు. అతడి అసలు పేరు శాంతకుమార్. ఆ దంపతులకు మరో కొడుకు రాజన్ ఉన్నాడు. శాంతకుమార్ చిన్నోడు. అయితే, భర్త వదిలేయడంతో ఆమె పల్లవరంలోని ఓ అనాథశ్రమానికి వెళ్లింది. కొన్నాళ్ల తర్వాత ఆమెను చూసి మిగతా పిల్లలు ఇంటిపై బెంగపెట్టుకుంటున్నారన్న సాకుతో ధనలక్ష్మిని ఆ అనాథాశ్రమం వాళ్లు పంపించేశారు. అప్పుడప్పుడు వెళ్లి ఆమె పిల్లలను చూసొచ్చేది. అయితే, ఒకసారి అనాథాశ్రమానికి వెళ్లగా పిల్లలు కనిపించలేదు. పిల్లలెక్కడ అని నిలదీస్తే, వేరే దేశపోళ్లు దత్తత తీసుకున్నారని వాళ్లు చెప్పారు. దీంతో ఆమెకు ఏడుపు తప్ప ఇంకేం మిగల్లేదు. అప్పటి నుంచి కన్న కొడుకుల గురించి బాధపడుతూనే ఉండేది. ఎక్కడో ఓ చోట తన పిల్లలు మంచి బతుకులు బతికితే చాల్లే అని తనకు తానూ సర్ది చెప్పుకునేది. ఒకసారి పెంపుడు తల్లి డేవిడ్ ఫొటోను అనాథాశ్రమానికి పంపింది. ఆ ఫొటోను ధనలక్ష్మికి ఇచ్చారు. ఆ ఫొటోను చూసే ఎప్పుడూ మురిసిపోయేది.
అన్న జాడ కూడా కనుక్కున్నడు
ఊహ తెలిశాక తన పెంపుడు తల్లిదండ్రులు తన దత్తత విషయాన్ని డేవిడ్‌కు చెప్పారు. అందులో భాగంగా తన మూలాలేంటో తెలుసుకునే క్రమంలో ముందు తన అన్న రాజన్ జాడ కనుక్కున్నాడు. డెన్మార్క్‌లోనే ఉంటున్న అతడి అన్న పేరు ఇప్పుడు మార్టిన్ మాన్యుయెల్ రాస్ముసేన్. తన కన్నతల్లిని వెతుక్కుంటూ తొలిసారి 2013లో ఇండియాకు వచ్చాడు డేవిడ్. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న తన తల్లి ఫొటో, తన చిన్నప్పటి ఫొటో, అనాథాశ్రమం అడ్రస్ పట్టుకుని జాడ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కానీ, 1990లోనే ఆ అనాథాశ్రమం మూతపడడంతో తల్లి జాడ దొరకలేదు. తిరిగి డెన్మార్క్ వెళ్లిపోయాడు. మళ్లీ 2017లో ఇండియాకు వచ్చాడు. చెన్నైకి చెందిన యాక్టివిస్టులు అంజలి పవార్, అరుణ్ ధోలెల సహకారం తీసుకున్నాడు. గత నెలలో డేవిడ్‌కు వీడియో కాల్ చేసిన అరుణ్ ధోలె, తన తల్లి ధనలక్ష్మితో మాట్లాడించారు. ఇప్పుడు ఆయన తన తల్లిని కలుసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవడంతో తల్లి కొడుకులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు.